వియత్నాంలో భారతీయ పర్యాటకుల ఇక్కట్లు.. స్పందించిన ఎంబసీ
ABN , Publish Date - Apr 09 , 2026 | 09:33 PM
వియత్నాంలో భారతీయులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్న వార్తలపై ఆ దేశ ఎంబసీ తాజాగా స్పందించింది. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధం దృఢమైనదని, భారతీయులకు తమ దేశ ప్రజలు సాదర స్వాగతం పలుకుతారని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: వియత్నాంలో భారతీయ పర్యాటకులు ఇక్కట్ల పాలవుతున్నారంటూ మీడియాలో వచ్చిన కథనాలపై న్యూఢిల్లీలోని వియత్నాం ఎంబసీ తాజాగా స్పందించింది. అవన్నీ అడపాదడపా జరిగిన ఘటనలు మినహా భారత్‌పై వియత్నాం ప్రజల అభిప్రాయాలకు సంకేతం కాదని స్పష్టం చేసింది. ఇరు దేశాల ప్రజల మధ్య ఎన్నో ఏళ్లుగా మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. పరస్పర సదభిప్రాయం ఉందని పేర్కొంది. ఇటీవల కాలంలో ఈ సంబంధాలు మరింత పెరిగాయని కూడా జాతీయ మీడియా ప్రతినిధులతో చెప్పింది. భారతీయులతో స్థానికులు దురుసుగా, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారన్న వార్తల నడుమ వియత్నాం ఎంబసీ ఈ మేరకు స్పందించింది.
వియత్నాంలో భారతీయుల భద్రతకు ఎలాంటి ఢోకా లేదని ఎంబసీ స్పష్టం చేసింది. భారత్ సహా వివిధ దేశాల పర్యాటకులకు వియత్నాం ప్రజలు సాదర స్వాగతం పలుకుతారని తెలిపింది. అయితే, ఇలాంటి ఉదంతాలు తమ దృష్టికి వచ్చిన మొదట్లోనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసినట్టు కూడా ఎంబసీ తెలిపింది. తమ ప్రజల ఆతిథ్యం గొప్పదని, విదేశీ పర్యాటకులతో వారు ఎంతో మర్యాదగా నడుచుకుంటారని చెప్పింది.
స్థానిక షాపుల యజమానులు కొందరు భారతీయ టూరిస్టులతో నిర్లక్ష్యంగా, అమర్యాదగా వ్యవహరిస్తున్నారన్న వార్తలు జాతీయ మీడియాలో వచ్చాయి. తాము భారతీయులమని తెలిశాక కొందరు షాపుల వారు సరిగా మాట్లాడేవారు కాదని కొందరు పేర్కొన్నారు. అమర్యాదగా వ్యవహరించే వారని తెలిపారు.
ఇదిలా ఉంటే, ఇటీవల కాలంలో వియత్నాంకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా అక్కడి స్ట్రీట్ లైఫ్, సాంస్కృతిక వైవిధ్యత, ప్రకృతి అందాలను చూసేందుకు జనాలు క్యూ కడుతున్నారు. టూరిజం వర్గాల ప్రకారం, ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో 1.5 లక్షలపై చిలుకు మంది భారతీయులు వియత్నాంలో పర్యటించారు. హనోయ్, హోచీమిన్ వంటి నగరాలకు భారతీయులు ఎక్కువగా వెళుతుంటారు.
ఈ వార్తలనూ చదవండి:
యూఎస్‌తో చర్చలు.. ఇరాన్ అణు ఇంధన సంస్థ చీఫ్ కీలక వ్యాఖ్య