Share News

పెను భూకంపంతో విలవిల..వణికిన వెనెజువెలా

ABN , Publish Date - Jun 26 , 2026 | 04:07 AM

సెలవురోజు.. సాయంత్రం.. అంతా సందడిగా గడుపుతున్న సమయం.. ఒక్క నిమిషం.. కేవలం ఒకే ఒక్క నిమిషం.. వరుసగా రెండు భారీ ప్రకంపనలు..

పెను భూకంపంతో విలవిల..వణికిన వెనెజువెలా

  • శిథిలాల కింద వేల మంది.. భారీ సంఖ్యలో మృతులు

  • నిమిషంలోనే 2 భారీ ప్రకంపనలు.. కరాకస్‌, లా గువైరాల్లో విధ్వంసం

  • కుప్పకూలిన భవనాలు.. దెబ్బతిన్న విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు

  • 164 మృతదేహాల గుర్తింపు.. వేలాది మందికి గాయాలు

  • 28 వేల మంది ఆచూకీ తెలియట్లేదంటూ ప్రత్యేక సైట్‌కు అభ్యర్థనలు

కరాక్‌స/న్యూఢిల్లీ, జూన్‌ 25: సెలవురోజు.. సాయంత్రం.. అంతా సందడిగా గడుపుతున్న సమయం.. ఒక్క నిమిషం.. కేవలం ఒకే ఒక్క నిమిషం.. వరుసగా రెండు భారీ ప్రకంపనలు.. ఎటు చూసినా విధ్వంసం.. పేకమేడల్లా కూలిన ఇళ్లు, భవనాలు.. దెబ్బతిన్న విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు.. జనం హాహాకారాలు.. శిథిలాల కింద నుంచి వినిపిస్తున్న ఆర్తనాదాలు.. వారి పరిస్థితిని తలచుకుంటూ కుటుంబ సభ్యుల రోదనలు.. ఎలాగోలా కాపాడుకునేందుకు హడావుడిగా ప్రయత్నా లు.. వెనెజువెలాలో సంభవించిన భారీ భూకంపం దృశ్యాలివి. ఈ విషాదంలో వందలాది మంది మరణించగా, వేలాది మంది గాయపడ్డారు. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నారు. దీనితో ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. గల్లంతైన, ఆచూకీ తెలియనివారి కోసం వెనెజువెలా నిర్వహించే వెబ్‌సైట్‌కు.. భూకంపం తర్వాత గురువారం రాత్రి వరకల్లా 28 వేల మందికిపైగా కనిపించడం లేదంటూ అభ్యర్థనలు అందాయి. భూకంపంతో లా గువైరా ప్రాంతం, రాజధాని కరాకస్‌ అతలాకుతలంకాగా, మోరన్‌, ఫాల్కన్‌ తదితర పట్టణాల్లోనూ తీవ్ర నష్టం జరిగింది. వందలాది భవనాలు కూలిపోయాయి. వేలాది భవనాలు బీటలువారి కూలిపోయే దశలో ఉన్నాయి. విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి.

2.jpg


సెలవు రోజు.. సాయంత్రం సందడి మధ్య..

వెనెజువెలాలో బుధవారం సెలవురోజు.. అంతా సందడిగా గడుపుతున్నారు. సాయంత్రం 6.04 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు) రిక్టర్‌ స్కేల్‌పై 7.2 తీవ్రతతో ఒక్కసారిగా భూమి కంపించింది. ఆ ప్రకంపనలు ఆగీ ఆగకముందే కేవలం నిమిషంలోపే మరింత ఉధృతంగా 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం వచ్చింది. ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు.. ఇలా ఎక్కడ, ఎలా ఉన్నవాళ్లు అలా బయటికి పరుగెత్తారు. రెండు భారీ భూకంపాల తర్వాత కూడా స్వల్పస్థాయి ప్రకంపనలు కొనసాగాయి. దీనితో ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనతో బుధవారం రాత్రంతా వీధుల్లో, పార్కుల్లో, రోడ్ల పక్కన పార్క్‌ చేసిన కార్లలో ఉండిపోయారు. వెనెజువెలా రాజధాని కరాక్‌సలోని సిమోన్‌ బొలివర్‌ ప్రధాన విమానాశ్రయం దెబ్బతినడంతో మూసివేశారు. భూకంపంతో గురువారం మధ్యాహ్నం వరకు 164 మృతదేహాలను వెలికితీశామని, 971 మంది గాయపడ్డారని వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్‌ వెల్లడించారు. శిథిలాల తొలగింపు, సహాయక చర్యలు వేగంగా సాగుతున్నట్టు తెలిపారు. వెనెజువెలాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దెబ్బతిన్న ఇళ్లు, ఆస్పత్రుల పునర్నిర్మాణం కోసం వెంటనే సుమారు రూ.1,890 కోట్ల (200 మిలియన్‌ డాలర్లు)తో ఫండ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

బ్రెజిల్‌ వరకు ప్రకంపనల తీవ్రత

వెనెజువెలాలో గత వందేళ్ల లో సంభవించిన అతి భారీ భూకంపం ఇదే కావడం గమనార్హం. ఈ ప్రకంపనల తీవ్రత వెనెజువెలాతోపాటు చుట్టుపక్కల ఉన్న కొలంబియా, బ్రెజిల్‌ సహా పలు దేశాల్లోనూ కనిపించింది. కరాక్‌సకు 1,700 కిలోమీటర్ల దూరంలోని బ్రెజిల్‌ పట్టణాలు మనౌస్‌, బెలెం, మకాపాలలో జనం ఇళ్లలోకి బయటికి పరుగెత్తారు.


లా గువైరాలో భయానక దృశ్యాలు

భూకంపంతో వెనెజువెలాలోని తీరప్రాంత పట్టణం లా గువైరాలో తీవ్రస్థాయిలో విధ్వంసం జరిగింది. పెద్ద సంఖ్యలో భవనాలు కూలిపోయాయి. దీనితో లా గువైరాను ‘విపత్తు ప్రాంతం (డిజాస్టర్‌ జోన్‌)’గా ప్రకటించి.. భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. తీరానికి సమీపంలో ఉన్న ప్రముఖ ‘హోటల్‌ ఎడ్వర్డ్‌’ పూర్తిగా కుప్పకూలి, శిథిలాల దిబ్బగా మారిపోయింది. ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉండే ఈ పది అంతస్తుల భవనంలో పార్టీలు, సమావేశాలు ఎక్కువగా జరుగుతుంటాయని.. అందులో ఎంతమంది చిక్కుకుపోయారో తెలియదని వెనెజువెలా అధికారులు తెలిపారు. ఇక ఆస్పత్రులు కూడా దెబ్బతినడం, విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో క్షతగాత్రులకు చికిత్స అందించడంలో ఇబ్బంది ఎదురవుతోంది. లా గువైరాలో ఆస్పత్రుల బయట, వీధుల్లోనే చికిత్సలు అందిస్తున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. చాలా చోట్ల విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతినడంతో.. ఏం జరుగుతోందో, తమవారి పరిస్థితి ఎలా ఉందో తెలియక ప్రజలు ఆందోళనలో చిక్కుకుపోయారు.

ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రపంచ దేశాలు

భూకంపంతో అతలాకుతలమైన వెనెజువెలాను ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. భూకంపంపై సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలను, వైద్య సామగ్రి, మందులను వెనెజువెలాకు పంపినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. ఈక్వెడార్‌, ఖతార్‌, మెక్సికో, ఎల్‌ సాల్వెడార్‌ తదితర దేశాలు సహాయక బృందాలను, మానవతా సాయాన్ని వెనెజువెలాకు పంపాయి. 85 రెస్క్యూ బృందాలను పంపుతున్నట్టు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌ తెలిపారు. వెనెజువెలాకు అవసరమైన సాయం అందజేస్తామని చైనా, స్పెయిన్‌, కొలంబియా తదితర దేశాలు ప్రకటించాయి. కాగా, వెనెజువెలాలో భూకంపం, ప్రాణ ఆస్తి నష్టంపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వెనెజువెలా ప్రజలకు సానుభూతి ప్రకటించారు.


తక్కువ లోతులో..‘డబ్లెట్‌’ ప్రకంపనలతో..

వెనెజువెలాలో వచ్చిన భూకంపాల్లో.. తొలి భూకంప కేంద్రం వెనెజువెలా తీరప్రాంత పట్టణం మోరన్‌కు పశ్చిమంగా 22 కిలోమీటర్ల లోతులో, రెండో భూకంప కేంద్రం అదే పట్టణానికి నైరుతి దిశలో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు అమెరికా జియాలాజికల్‌ సర్వే (యూఎస్‌జీఎస్‌) వెల్లడించింది. రెండూ కూడా కేవలం 39 సెకన్ల తేడాతో రిక్టర్‌ స్కేల్‌పై 7.2, 7.5 స్థాయిలో వచ్చాయని తెలిపింది. ఇలా వెంటవెంటనే రావడాన్ని ‘డబ్లెట్‌’ భూకంపంగా పేర్కొంది. సాధారణంగా 30 నుంచి 60 కిలోమీటర్ల వరకు లోతులో భూకంప కేంద్రాలు ఉంటుంటాయి. వాటితో ఉపరితలంపై పెద్దగా ప్రభావం ఉండదు. లోతు తగ్గినకొద్దీ ప్రభావం పెరుగుతుంది. ఇప్పుడు వెనెజువెలాలో వచ్చిన రెండో ప్రకంపన కేంద్రం కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఉండటం, అదీ డబ్లెట్‌ భూకంపం కావడంతో నష్టం భారీగా ఉంటుందని యూఎ్‌సజీఎస్‌ పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో భూకంపం రావడంతో 10 వేల నుంచి లక్ష మంది వరకు మరణించే అవకాశం ఉందని తొలుత ప్రకటించింది. కానీ అంత భారీగా ప్రాణనష్టం ఉండకపోవచ్చని తర్వాత సవరించుకుంది.

భూఫలకాల కదలికలతో..

భూమిపై చురుకుగా టెక్టానిక్‌ ప్లేట్ల (భూఫలకాల) కదలికలు ఉన్న ప్రాంతాల్లో కరీబియన్‌ ఒకటి. అక్కడ కరీబియన్‌ ఫలకం దక్షిణ అమెరికా ఖండం ఉన్న భూఫలకంవైపు కదులుతూ, ఒరుసుకుంటోంది. బొకొనో ఫాల్ట్‌ (చీలిక)గా పిలిచే ఈ ప్రాంతంలో భూకంపాలు రావడం సాధారణమే. వెనెజువెలా దేశ ఉత్తర భాగం బొకొనో ఫాల్ట్‌ ప్రాంతంలోనే ఉంటుంది. ఇప్పుడదే ప్రాంతంలో భారీ ప్రకంపనలు వచ్చాయి.

Updated Date - Jun 26 , 2026 | 04:07 AM