Share News

చర్చలపై పీటముడి

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:06 AM

అమెరికా- ఇరాన్‌ మధ్య రెండోదఫా చర్చలపై పీటముడి వీడటం లేదు. ఆదివారం చర్చలు ఉంటాయని అంతా భావిస్తున్న సమయంలో ...

చర్చలపై పీటముడి

  • పాకిస్థాన్‌కు వచ్చి వెళ్లిపోయిన అరాగ్చీ

  • ఆ దేశ ప్రధాని, సైన్యాధ్యక్షుడితో సమావేశం

  • మరోవైపు, అమెరికా ప్రతినిధుల పర్యటన రద్దు

ఇస్లామాబాద్‌/ వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 25: అమెరికా- ఇరాన్‌ మధ్య రెండోదఫా చర్చలపై పీటముడి వీడటం లేదు. ఆదివారం చర్చలు ఉంటాయని అంతా భావిస్తున్న సమయంలో ఎటువారు అటే ఆగిపోయారు. శుక్రవారం రాత్రి పాకిస్థాన్‌కు వచ్చిన ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ.. పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌, సైన్యాధ్యక్షుడు అసిమ్‌ మునీర్‌ను కలిసి శనివారం తిరిగి వెళ్లిపోయారు. అబ్బాస్‌ పాక్‌ రావటంతో చర్చల కోసం తమ ప్రతినిధులు జారెడ్‌ కుష్నర్‌, స్టీవ్‌ విట్‌కా్‌ఫను కూడా పంపుతున్నట్లు ప్రకటించిన అమెరికా.. చివరి నిమిషంలో వారి పర్యటనను రద్దుచేసింది. దీంతో చర్చల ప్రయత్నాలకు విఘాతం కలిగింది. అంతకుముందు తాము అమెరికా ప్రతినిధులతో నేరుగా చర్చలు జరుపబోమని ఇరాన్‌ ప్రకటించింది. తమ అభిప్రాయాలను, ఆందోళన ను పాకిస్థాన్‌ ప్రతినిధులకు చేరవేస్తామని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్‌ బఖయి శనివారం ట్వీట్‌ చేశారు. కానీ, ఇరాన్‌ నేతలతో నేరుగా చర్చలు జరిపేందుకు కుష్నర్‌, విట్‌కా్‌ఫలను పంపుతున్నట్లు ట్రంప్‌ రాయిటర్స్‌ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అబ్బాస్‌ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయిన తర్వాత ట్రంప్‌ ఫాక్స్‌ న్యూస్‌ వార్తా సంస్థతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పాక్‌కు వెళ్లేందుకు మావాళ్లు సిద్ధమయ్యారు. అయితే, కొద్దిసేపటి క్రితమే వారికి అక్కడికి వెళ్లవద్దని చెప్పాను. ఏ ప్రయోజనమూ లేనిదానికి 18 గంటలపాటు ప్రయాణం చేసి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పాను. మావద్ద అన్ని రకాల కార్డులు ఉన్నాయి. వాళ్లకు (ఇరాన్‌) ఇష్టమైనప్పుడే మాకు కాల్‌ చేయనివ్వండి’ అని పేర్కొన్నారు.

మలక్కాలోనూ టోల్‌ వసూలు: ఇండోనేషియా

హోర్ముజ్‌లో వాణిజ్య నౌకల నుంచి ఇరాన్‌ టోల్‌ వసూలు చేస్తున్నట్లు ప్రకటించటంతో మలక్కా జలసంధి నుంచి వెళ్లే నౌకల నుంచి తాము కూడా టోల్‌ వసూలు చేస్తామని ఇండోనేషియా ఆర్థిక మంత్రి పర్బయా యుధి సదెవా శనివారం ప్రకటించారు. ఈ జలసంధి ఇండోనేషియా, మలేషియా, సింగపూర్‌ సరిహద్దుల్లో ఉంది. మరోవైపు, ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనాకు చెందిన దాదాపు 40 సంస్థలు, చమురు ట్యాంకర్లు, చమురు శుద్ధి కేంద్రాలపై కఠిన ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ ప్రకటించారు. ముఖ్యంగా అత్యధికంగా ఇరాన్‌ ముడి చమురును కొనుగోలు చేస్తున్న హెంగ్లి పెట్రోకెమికల్‌ రిఫైనరీపై తొలిగా ఆంక్షలు విధించినట్లు చెప్పారు. కాగా, ఇరాన్‌ ప్రభుత్వం టెహ్రాన్‌ విమానాశ్రయం నుంచి శనివారం పౌర విమాన సర్వీసులను ప్రారంభించింది.

Updated Date - Apr 26 , 2026 | 04:06 AM