Share News

బాత్‌‌టబ్‌లో చిక్కుకుపోయిన మహిళ.. 9 రోజుల పాటు నరకం..

ABN , Publish Date - Jul 15 , 2026 | 09:44 AM

ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో చిక్కుకుపోయింది. బయటకు రాలేని పరిస్థితిలో 9 రోజుల పాటు నరకం చూసింది. 9 రోజుల తర్వాత సోదరుడి పుణ్యమా అని ప్రాణాలతో బయటపడింది.

బాత్‌‌టబ్‌లో చిక్కుకుపోయిన మహిళ.. 9 రోజుల పాటు నరకం..
Bathtub survival

న్యూయార్క్, జులై 15: ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో చిక్కుకుపోయింది. బయటకు రాలేని పరిస్థితిలో 9 రోజుల పాటు నరకం చూసింది. 9 రోజుల తర్వాత సోదరుడి పుణ్యమా అని ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నార్త్ కరోలినాలోని క్లైడ్‌కు చెందిన 82 ఏళ్ల జోన్ రివెట్ 2023లో భర్తను కోల్పోయింది. అప్పటినుంచి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. జూన్ 1వ తేదీన ఆమె ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడిపోయింది. తీవ్ర గాయాల కారణంగా కదలలేని పరిస్థితిలో టబ్ నుంచి బయటకురాలేకపోయింది.


సాయం కోసం గట్టిగా అరిచినా లాభం లేకపోయింది. గంటలు, రోజులు గడిచాయి. ఆమె తన కాలి సాయంతో బాత్‌టబ్ కొళాయి తిప్పి, ఆ నీటిని ముఖంపై చల్లుకుంటూ దాహాన్ని తీర్చుకుంది. రివెట్ సోదరుడు బిల్ లెస్కో.. జార్జియాలో ఉంటున్నాడు. ఆమె రెండు, మూడు రోజులకు ఒకసారి సోదరుడికి ఫోన్ చేసేది. అయితే, వారం రోజులు అవుతున్నా ఆమె నుంచి ఎలాంటి ఫోన్ రాకపోవడంతో అతడి మనసు కీడు శంకించింది. పొరిగింటి వాళ్లకు ఫోన్ చేసి సోదరి గురించి ఎంక్వైరీ చేశాడు. జోన్ రివెట్ కారు ఇంటి ముందే ఉందని వాళ్లు లెస్కోకు చెప్పారు.


అతడు వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. తన సోదరి ఇంటికి వెళ్లి.. ఆమె ఎలా ఉందో తెలుసుకోమని అడిగాడు. పోలీసులు జూన్ 10వ తేదీన జోన్ రివెట్ ఇంటికి వెళ్లారు. ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం రివెట్ ఆరోగ్యం కుదుటపడింది. దారుణమైన అనుభవం నేపథ్యంలో రివెట్ ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఒంటరిగా ఉండకుండా జార్జియాలో ఉన్న తన సోదరుడి ఇంటికి మారాలని ఆమె నిర్ణయించుకుంది.


ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌-తిరుపతి ఉదయం విమాన టికెట్లకు భారీ డిమాండ్

అస్సాంలో వరద బీభత్సం.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

Updated Date - Jul 15 , 2026 | 09:51 AM