పాక్‌కు షాకిచ్చిన యూఎస్
ABN , Publish Date - Jun 06 , 2026 | 08:32 PM
బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద జాబితాలోకి చేర్చాలన్న పాక్ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. పాక్ ప్రతిపాదనను అమెరికా తోసిపుచ్చింది. ఈ విషయంలో భారత్ అభిప్రాయంతో యూఎస్ ఏకీభవించింది.
ఇంటర్నెట్ డెస్క్: పాక్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌ను ప్రత్యేకంగా దేశంగా ప్రకటించాలంటూ ఉద్యమిస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీని (బీఎల్ఏ) ఉగ్రసంస్థగా ప్రకటించాలన్న పాక్, చైనా ప్రయత్నాలకు అమెరికా చెక్ పెట్టింది. ఐక్యరాజ్య సమితిలో ఇరు దేశాల ప్రయత్నాలను అడ్డుకుంది. యూఎన్ 1267 జాబితాలో బీఎల్ఏను ఉగ్రసంస్థగా ప్రకటించేందుకు తగిన ఆధారాలు లేవని చెప్పింది. ఐసిస్, అల్-ఖయిదాతో ఈ సంస్థకు సంబంధాలను నిరూపించే స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంది. ఈ అంశంలో చైనా, పాక్ ప్రతిపాదనను తొసిపుచ్చింది.
ఇటీవల అమెరికాతో మెరుగుపడ్డ సంబంధాలను ఆసరాగా చేసుకుని బీఎల్ఏను ఉగ్రసంస్థల జాబితాలో చేరుద్దామనుకున్న పాక్ ఆశలకు తాజా పరిణామంతో గండిపడింది. ఈ ప్రతిపాదనను అడ్డుకునేందుకు భారత్ చేసిన ప్రయత్నం ఫలించింది. ఈ విషయంలో అమెరికా మనసు మార్చేందుకు భారత్, ఫ్రాన్స్‌తో కలిసి ప్రయత్నించింది. దీంతో, ఉగ్రవాదం విషయంలో భారత అభిప్రాయాలతో అమెరికా ఏకీభవిస్తుందోన్న గట్టి సందేశం పాక్‌కు పంపించినట్టైందని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.
బీఎల్ఏ వెనుక భారత్ ఉందని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తరచూ ఆరోపిస్తున్నారు. భారత్ తమ దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని ప్రపంచాన్ని నమ్మించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ట్రంప్ పాక్‌కు కాస్త సన్నిహితమైనట్టు కనిపిస్తుండటంతో అటువైపు నుంచి పనిని చక్కబెట్టేందుకు పావులు కదిపారు. ఆపరేషన్ సిందూర్ తరువాత ఈ దిశగా పాకిస్థాన్ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. బీఎల్‌ఏతో పాటు దానికి అనుబంధంగా ఉండే మాజిద్ బ్రిగేడ్‌పై అంతర్జాతీయ ఆంక్షల విధించేలా చైనాతో కలిసి ప్రయత్నాలు చేసింది. గతేడాది ది రెసిస్టెన్స్ ఫ్రంట్, ఎల్‌ఈటీని విదేశీ టెర్రరిస్టు సంస్థలుగా అమెరికా గుర్తించిన నేపథ్యంలో బీఎల్ఏపై కూడా ఇదే ముద్ర వేయాలని పట్టుబట్టింది. చైనా సాయంతో అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున లాబీయింగ్‌కు దిగింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, పాక్ చర్యలకు వ్యతిరేకంగా భారత్ కూడా తన ప్రయత్నాలను వేగవంతం చేసింది. కీలకమైన ఫ్రాన్స్ దేశం మద్దతును కూడగట్టింది. ఇరు దేశాలు కలిసికట్టుగా ప్రయత్నించి బీఎల్‌ఏపై యూఎన్‌లో వేటుపడకుండా అమెరికాను ఒప్పించాయి. ఈ విషయంలో యూకే కూడా సానుకూలంగా స్పందించింది. చైనాకు మిత్రదేశమైన రష్యా ఈ విషయంలో మౌనంగా ఉండిపోయింది. చివరకు పాక్ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే, ఐక్యరాజ్య సమితిలోని ఇతర నిబంధనల కింద ఆంక్షల విధించే అంశాన్ని పాక్ ప్రస్తుతం పరిశీలిస్తోంది
ఈ వార్తలనూ చదవండి:
మళ్లీ దాడులకు దిగిన ఇరాన్.. గల్ఫ్‌లో కలకలం
భారత్‌పై ఆంక్షల బెదిరింపులు మొదటికే మోసం తెస్తాయి: పుతిన్