Share News

హోర్ముజ్‌ను తెరవండ్రా.. తీవ్ర అసహనంతో ట్రంప్‌ బూతులు

ABN , Publish Date - Apr 06 , 2026 | 04:10 AM

హోర్ముజ్‌ జలసంధి మూసివేత తదనంతర పరిణామాలు, ఇరాన్‌ నుంచి వరుసగా ఎదురుదెబ్బల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నియంత్రణ కోల్పోయారు. ఒప్పందానికి రావాలంటూ తాను పెట్టిన గడువు ముగుస్తున్నా ఇరాన్‌ స్పందించకపోవడంతో సహనం కోల్పోయి బూతులు లంకించుకున్నారు.

హోర్ముజ్‌ను తెరవండ్రా.. తీవ్ర అసహనంతో ట్రంప్‌ బూతులు

  • వెంటనే జలసంధిని తెరవకపోతే నరకంలో జీవించాల్సి వస్తుంది

  • మంగళవారం ఇరాన్‌లో బ్రిడ్జిడే,పవర్‌ ప్లాంట్‌ డే.. అన్నీ పేల్చేస్తాం

  • చమురును స్వాధీనం చేసుకుంటాం

  • తాజాగా టెహ్రాన్‌లో భారీ దాడి చేశాం

  • కొందరు ఇరాన్‌ అధికారుల చర్చలు..సోమవారం ఒప్పందానికి అవకాశం

  • ఇరాన్‌లో తిరుగుబాటుదారులకు ఆయుధాలు పంపాం.. కానీ మధ్యలో కుర్దులు తీసేసుకున్నట్టున్నారు: ట్రంప్‌

  • మా కొంప ముంచుతున్న యుద్ధం

  • మాకు రావాల్సిన ఆయుధాలు ఇరాన్‌పై వాడుతున్నారు: జెలెన్‌స్కీ

  • మంటల్లో గల్ఫ్‌ దేశాలు!

  • ఇరాన్‌ దాడులతో కువైట్‌ కకావికలం

  • బహ్రెయిన్‌, సౌదీ, యూఏఈలోని చమురు, ఇంధన వ్యవస్థలపై దాడులు

  • మా మౌలిక సదుపాయాలపై దాడులకు ప్రతీకారంగానే: ఐఆర్‌జీసీ

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5: హోర్ముజ్‌ జలసంధి మూసివేత తదనంతర పరిణామాలు, ఇరాన్‌ నుంచి వరుసగా ఎదురుదెబ్బల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నియంత్రణ కోల్పోయారు. ఒప్పందానికి రావాలంటూ తాను పెట్టిన గడువు ముగుస్తున్నా ఇరాన్‌ స్పందించకపోవడంతో సహనం కోల్పోయి బూతులు లంకించుకున్నారు. ‘ఆ ఫ..గ్‌ హోర్ముజ్‌ జలసంధిని తెరవండి.. యూ బా..ర్డ్స్‌. లేకపోతే నరకంలో జీవించాల్సి వస్తుంది’ అని తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తూ అసభ్య పదజాలంతో ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు. ఒప్పందం కోసం ఇరాన్‌కు పెట్టిన గడువు సోమవారంతో ముగుస్తుండడంతో మంగళవారం నుంచి విద్యుత్‌ కేంద్రాలు, వంతెనలపై దాడులు చేస్తామన్నారు. ‘‘మంగళవారం ఇరాన్‌లో పవర్‌ ప్లాంట్‌ డే, బ్రిడ్జ్‌ డే.. రెండూ ఒకేసారి జరుగుతాయి. ఎన్నడూ లేనంత స్థాయిలో ఇది ఉంటుంది. వెంటనే జలసంధిని తెరవండి. లేకపోతే నరకంలో జీవించాల్సి వస్తుంది. చూస్తూ ఉండండి. అల్లాకు నా స్తోత్రం’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇది యుద్ధంలో ఒక కీలక ఘట్టమని చెప్పారు. టెహ్రాన్‌లో తాము చేసిన భారీ దాడిలో చాలా మంది ఇరాన్‌ సైనికాధికారులు మరణించారని ప్రకటించారు. ఇరాన్‌ కూల్చేసిన ఎఫ్‌-15ఈ విమానం రెండో పైలట్‌ను విజయవంతంగా రెస్క్యూ చేశామని, ఆ కల్నల్‌ ఇప్పుడు సురక్షితంగా ఉన్నారని ట్రంప్‌ వెల్లడించారు. తమ సైనికుడి కోసం అమెరికా చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్‌ చేపట్టామని చెప్పారు.


ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలతో కూడిన పదుల సంఖ్యలో విమానాలు, హెలికాప్టర్లను పంపించామన్నారు. ఒక పైలట్‌ను త్వరగానే గుర్తించి రక్షించామని.. రెండో పైలట్‌కు ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో ఆ వివరాలను ముందుగా ప్రకటించలేదని తెలిపారు. ఇరాన్‌లోని ప్రమాదకర పర్వత ప్రాంతాల్లో రెండో పైలట్‌ చిక్కుకుపోయారని.. ఆయన లొకేషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చామని వివరించారు. గంట గంటకూ పెద్ద సంఖ్యలో శత్రువులు ఆయనకు దగ్గరగా వచ్చారని, ఈ క్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి రక్షించామని తెలిపారు. పైలట్‌ తీవ్రంగా గాయపడ్డారని, అయినా చాలా ధైర్యంగా ఉన్నారని పేర్కొన్నారు. భారీ ఆపరేషన్‌తో శత్రువుల భూభాగం నుంచి ఇద్దరు సైనికులను వేర్వేరుగా రక్షించడం అమెరికా మిలిటరీ చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పారు. పగటి సమయంలో శత్రువుల గగనతలంలో ఏడు గంటల పాటు ఉండటం, ఒక్క అమెరికన్‌ కూడా మృతిచెందకుండా విజయవంతంగా ఇద్దరు పైలట్లను రక్షించడం తమ మిలిటరీ నైపుణ్యానికి, ధైర్యానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. కొందరు ఇరాన్‌ అధికారులు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారని.. సోమవారం ఒప్పందం కుదరడానికి ఒక మంచి అవకాశం ఉందని ట్రంప్‌ ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఫోన్‌ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇరాన్‌ ఒప్పందానికి రాకపోతే ఆ దేశంలో అన్నింటినీ నాశనం చేసి, చమురును స్వాధీనం చేసుకుంటామని వ్యాఖ్యానించారు. ఇరాన్‌లో మొత్తం వంతెనలు, విద్యుత్‌ ప్లాంట్లు కూలిపోతాయన్నారు. ఇక ఈ ఏడాది మొదట్లో ఇరాన్‌లో ఆందోళనకారులకు ఇరాక్‌లోని కుర్దుల ద్వారా చాలా ఆయుధాలు పంపామని, కానీ అవి వారికి చేరలేదని చెప్పారు. కుర్దులే ఆ ఆయుధాలను తీసేసుకుని ఉంటారని వ్యాఖ్యానించారు. ఇక యాక్సియోస్‌ ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ఇటీవలి చర్చల సమయంలో ప్రత్యక్ష భేటీ కోసం ఇరాన్‌ అదనంగా ఐదు రోజులు సమయం అడిగిందని.. వారు చర్చల విషయంలో సీరియ్‌సగా లేరని తనకు అనిపించడంతో ‘బీ1’ వంతెనపై దాడి చేశామని చెప్పారు.

Updated Date - Apr 06 , 2026 | 06:19 AM