ఇరాన్ తీరంపై బాంబుల వర్షం కురిపిస్తాం: ట్రంప్
ABN , Publish Date - Mar 14 , 2026 | 09:27 PM
హోర్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో ఇరాన్ తీరంపై బాంబుల వర్షం కురిపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. జలసంధిని తెరిచి ఉంచేందుకు అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా యుద్ధ నౌకలను మోహరించే అవకాశముందని తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరో హెచ్చరిక చేశారు. ఆ దేశ తీరం వెంబడి బాంబుల వర్షం కురిపిస్తామని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో హెచ్చరిక చేశారు. త్వరలో ఆ ప్రాంతంలో యుద్ధ నౌకలను కూడా మోహరిస్తామని అన్నారు. జలసంధి మూసివేతతో ప్రభావితం అవుతున్న చైనా, ఫ్రాన్స్, జపాన్ దేశాలు కూడా తమ యుద్ధ నౌకలను హోర్ముజ్ జలసంధికి పంపించాలని విజ్ఞప్తి చేశారు.
‘జలసంధిని తెరిచి ఉంచేలా అమెరికాతో పాటు అనేక ఇతర ప్రభావిత దేశాలు యుద్ధ నౌకలను పంపించనున్నాయి. ఇరాన్ మిలిటరీని ఇప్పటికే 100 శాతం ధ్వంసం చేశాము. అయినా వారికి హోర్ముజ్ జలసంధిలో దాడులు చేయడం సులభం. డ్రోన్‌లు, మైన్స్, చిన్న చిన్న మిసైల్స్ ద్వారా ఏదో ఒక వైపు నుంచి దాడులు చేస్తారు’
‘కాబట్టి, జలసంధి మూసివేతతో ప్రభావితమవుతున్న చైనా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, బ్రిటన్, ఇతర దేశాలు కూడా తమ యుద్ధ నౌకలను పంపిస్తాయనే అనుకుంటున్నాను. ఇరాన్ బెదిరింపులను ఇక ఎంతమాత్రం సహించలేము. అక్కడి తీరంపై బాంబుల వర్షం కురిపిస్తాము. ఇరాన్ పడవలు, నావలపై నిరంతరం దాడులు చేస్తాము. ఎలాగైనా సరే హోర్ముజ్ జలసంధిని తెరిపించి తీరుతాము’ అని ట్రూత్ సోషల్‌లో ఆయన పోస్టు చేశారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుత పరిస్థితులపై భారత్‌లోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉద్రికత్తల కారణంగా ఇరాన్ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జనాలపై ప్రభావం పడుతోందని అన్నారు. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా విస్తృత ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతోందని అన్నారు. ఇక భారత నౌకలను హోర్ముజ్ జలసంధి మీదుగా అనుమతిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
సౌదీ బేస్‌పై ఇరాన్ దాడి.. ఐదు అమెరికా విమానాలు ధ్వంసం..
అమెరికాలో 11 మంది భారతీయుల అరెస్ట్.. కారణమిదే.!