ఇంకా 48 గంటలే.. ఆ తరువాత.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
ABN , Publish Date - Apr 04 , 2026 | 09:00 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను మరోసారి హెచ్చరించారు. తాను గతంలో విధించిన డెడ్‌లైన్ మరో 48 గంటల్లో ముగుస్తుందని గుర్తు చేశారు. ఆ తరువాత బీభత్సం తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను మరోసారి హెచ్చరించారు. ఇరాన్ దారికి రాకపోతే మరో 48 గంటల తరువాత బీభత్సం తప్పదని అన్నారు. హోర్ముజ్‌పై డీల్ కోసం గతంలో విధించిన ఏప్రిల్ 6వ తేదీ డెడ్‌లైన్‌ను ట్రంప్ ఇరాన్‌కు గుర్తుచేశారు. డెడ్‌లైన్ తరువాత తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు పెట్టారు.
‘డీల్ కుదుర్చుకునేందుకు లేదా హోర్ముజ్‌ను తెరిచేందుకు నేను గతంలో ఇరాన్‌కు పది రోజుల గడువు ఇచ్చాను. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. సమయం మించిపోతోంది. ఇంకా 48 గంటలే ఉన్నాయి’ అని ట్రంప్ పోస్టు చేశారు.
ఇక యుద్ధం ముగింపు దిశగా పాక్‌లో చర్చలకు తాము హాజరుకాబోమని ఎప్పుడూ చెప్పలేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ తాజాగా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. పాక్ మధ్యవర్తిత్వంపై కృతజ్ఞతతో ఉన్నామని కూడా అన్నారు. ఇరాన్‌పై అక్రమ దాడుల ముగింపునకే తమ ప్రాధాన్యమని కూడా చెప్పుకొచ్చారు. గల్ఫ్‌లో యుద్ధం ముగింపు కోసం పాక్ వేదికగా జరుగుతున్న చర్చల్లో పురోగతి కొరవడిందన్న వార్తల నడుమ ఇరాన్ మంత్రి ఈ కామెంట్స్ చేశారు.
ఇక ఇరాన్‌పై దాడుల లక్ష్యాలకు సంబంధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటివరకూ పలు రకాల ప్రకటనలు చేశారు. ఇరాన్ మిసైల్ సామర్థ్యాన్ని దెబ్బతీయడం, అణ్వాయుధాలు ఇరాన్‌కు దక్కకుండా అడ్డుకోవడం, నేవీని ధ్వంసం చేయడం తమ లక్ష్యమని ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన రోజున ట్రంప్ పేర్కొన్నారు.
భూతల దాడులకు దిగే దిశగా ట్రంప్ యోచిస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాకు ట్రంప్ దాదాపు 50 వేల మంది అమెరికన్ సైనిక సిబ్బందిని తరలించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇరాన్‌పై యుద్ధానికి ముడి చమురుకు ఎలాంటి సంబంధం లేదని ఆ తరువాత మరో సందర్భంలో ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ ముడి చమురు అమెరికా ఆధీనంలోకి రావాలనేలా మరోసారి కామెంట్స్ చేశారు. ఆ తరువాత కొన్ని రోజులకు హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ పలు వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్‌ను తెరిపించేందుకు ఇతర దేశాలు రంగంలోకి దిగాలని అన్నారు. ఈ విషయంలో తమకు ఎవరి అవసరం లేదని మరోసారి వ్యాఖ్యానించారు.
ఈ వార్తలూ చదవండి:
పాక్‌లో చర్చలకు వెళ్లబోమని మేమెప్పుడూ చెప్పలేదు: ఇరాన్ మంత్రి
అమెరికాకు దెబ్బ మీద దెబ్బ.. యూఎస్ ఎమ్‌క్యూ -1 డ్రోన్‌ను కూల్చేసిన ఇరాన్..