మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా స్వాగతిస్తా! కానీ.. ట్రంప్ కీలక వ్యాఖ్య
ABN , Publish Date - Oct 27 , 2026 | 10:15 PM
మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా తాను స్వాగతిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. అయితే, ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా జరిగితేనే ఫలితాన్ని అంగీకరిస్తానని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా తాను స్వాగతిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. అయితే, ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా ఎలాంటి అవకతవకలు లేకుండా జరిగితేనే ఫలితాన్ని అంగీకరిస్తానని చెప్పారు. టెక్సాస్‌లో రిపబ్లికన్స్ తరఫున ప్రచార కార్యక్రమానికి వెళ్లేముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల ఆధిపత్యం వస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ వారితో కలిసి పనిచేసేందుకు ఏదో ఒక మార్గాన్ని అన్వేషిస్తామని అన్నారు. ఈ సందర్భంగా తనకున్న వీటో అధికారాన్ని కూడా ప్రస్తావించారు. మునుపటి అధ్యక్షులు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారని, చివరకు రాజకీయ ఏకాభిప్రాయాన్ని సాధించారని గుర్తు చేశారు.
టెక్సాస్‌లో రిపబ్లికన్ పార్టీ సెనేట్ అభ్యర్థి కెన్ పాక్స్‌టన్ తరఫున ప్రచారం చేసేందుకు ట్రంప్ వెళ్లారు. అయితే, కెన్‌కు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జేమ్స్ టెలారికో నుంచి గట్టిపోటీ ఎదురవుతోందని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం అమెరికా ఎగువ, దిగువ సభల్లో రిపబ్లికన్లు మెజారిటీలో ఉన్నారు. దిగువ సభలో డెమాక్రాట్లు పైచేయి సాధిస్తే రిపబ్లికన్‌లు ప్రతిపాదించే బిల్లులకు ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. సెనేట్‌లో కూడా డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తే ట్రంప్ ప్రభుత్వంలో సీనియర్ అధికారుల నియామకం మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.
ఓట్ల విషయంలో ఇప్పటికే కాలిఫోర్నియా రాష్ట్రం, ఫెడరల్ ప్రభుత్వం మధ్య వివాదం నెలకొంది. రాష్ట్రంలో సుమారు 20 వేల బ్యాలెట్లు (ఓట్లు) అమెరికా పౌరులవి కాకపోవచ్చని ఫెడరల్ ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశాలపై విచారణ జరపడంలో కాలిఫోర్నియా అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
హూతీలతో సౌదీ అరేబియా రహస్య ఒప్పందం.. శాంతి కోసం బిలియన్ డాలర్ల ఆఫర్..?
ఏఐ ఎఫెక్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకూ ముప్పు