Share News

నాకు అస్సలు నచ్చలేదు.. ఇరాన్ ప్రతిపాదనలకు నో చెప్పిన ట్రంప్!

ABN , Publish Date - May 11 , 2026 | 08:04 AM

యుద్ధ విరమణ కోసం ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఇరాన్ ప్రతిపాదనలు అసలేమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

నాకు అస్సలు నచ్చలేదు.. ఇరాన్ ప్రతిపాదనలకు నో చెప్పిన ట్రంప్!
Trump Rejects Iran proposal

ఇంటర్నెట్ డెస్క్: యుద్ధ విరమణ దిశగా ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తిరస్కరించారు. ఇరాన్ ప్రతిపాదనలు అస్సలు ఆమోదయోగ్యం కాదన్నారు. ‘ఆ ప్రతిపాదనలు నాకు ఏమాత్రం నచ్చలేదు. అస్సలు ఆమోదయోగ్యం కాదు’ అని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌ సోషల్‌లో ఆయన పోస్టు పెట్టారు. ఇరాన్ ఇలా మొండిగా మారడానికి ఒబామా ప్రభుత్వమే కారణమని కూడా ట్రంప్ మరో పోస్టులో ఆరోపించారు. ఒబామా హయాంలో కుదిరిన ఒప్పందం వల్లే ఇరాన్‌కు ధైర్యం మరింత పెరిగిందని అన్నారు. గత ప్రభుత్వాల బలహీనత కారణంగా దశాబ్దాలుగా ఇరాన్ యూఎస్‌తో చెడుగుడు ఆడుతోందని మండిపడ్డారు. అమెరికాను చూసి హేళన చేస్తున్న ఇరాన్‌ ముఖంపై ఆ నవ్వులు త్వరలో మాయమవుతాయని కూడా హెచ్చరించారు.

పాక్‌లోని మధ్యవర్తుల ద్వారా ఇరాన్ తన ప్రతిపాదనలను అమెరికాకు పంపింది. తమను కట్టడి చేసేందుకు ఉద్దేశించిన వాణిజ్య, మిలిటరీ చర్యలన్నిటికీ యూఎస్ ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రతిపాదించింది. తమపై విధించిన ఆంక్షలను తొలగించాలని కూడా కోరినట్టు ఇరాన్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.

విదేశాల్లోని తమ ఆస్తులపై ఆంక్షలను 30 రోజుల పాటు సడలించాలని ఇరాన్ యూఎస్‌కు ప్రతిపాదించింది. ఇరాన్‌ పోర్టుల నుంచి నౌకల రాకపోకలను కూడా యూఎస్ అడ్డుకోకూడదని పేర్కొంది. ఇందుకు ప్రతిగా తాము హోర్ముజ్‌లో వాణిజ్య సరకు రవాణాకు అనుమతిస్తామని ప్రతిపాదించింది. హోర్ముజ్‌పై నియంత్రణను తమ ఆధీనంలోనే పెట్టుకుంటామని పేర్కొంది. ఈ దిశగా యూఎస్‌ నుంచి హామీలను కూడా కోరింది.


తమ అణుకార్యక్రమంపై వేరుగా యూఎస్‌తో చర్చలు జరుపుతామని కూడా ఇరాన్ స్పష్టం చేసింది. ప్రస్తుత ఉద్రిక్తతలతో వాటికి ముడిపెట్టవద్దని కూడా చెప్పింది. తమ వద్ద శుద్ధి చేసిన యూరేనియం నిల్వలను తగ్గించుకునేందుకు వాటిని అమెరికాకు బదులు మరో దేశానికి పంపిస్తామని ప్రతిపాదించింది. ఈ వ్యవహారాల్లో యూఎస్ మళ్లీ పాత ధోరణికి మారితే యూరేనియం నిల్వలు వెనక్కు తెచ్చుకునేలా ఒప్పందం చేసుకుందామని కూడా పేర్కొంది.

ఇక ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యుద్ధం ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఇరాన్ అణులక్ష్యాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు యూఎస్, ఇజ్రాయెల్ కట్టుబడి ఉన్నాయని చెప్పారు.

ఇదిలా ఉంటే అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ కూడా తిరస్కరించింది. ఈ మేరకు ఇరాన్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికా ప్రతిపాదనలకు అంగీకరించడమంటే పూర్తిగా లొంగిపోవడమేనని పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

సముద్రంలో చమురు పారబోస్తున్న ఇరాన్‌?

పాక్‌లో పోలీసు పోస్టుపై కారు బాంబు దాడి

Updated Date - May 11 , 2026 | 08:46 AM