ఈ రాత్రికే అంతం
ABN , Publish Date - Apr 08 , 2026 | 03:55 AM
బాంబు దాడులతో ఎంతగా విధ్వంసం సృష్టిస్తున్నా ఇరాన్ లొంగకపోవటంతో ఆగ్రహంతో రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..
ఒక నాగరికత తుడిచిపెట్టుకుపోతుంది
ఇరాన్‌పై అణుదాడి చేస్తామన్నట్లుగా మంగళవారం ట్రంప్ పరోక్ష హెచ్చరిక
అధ్యక్షుడు మాత్రమే వాడగలిగే టూల్ ఉపయోగించే అవకాశం
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడి
ఇరాన్‌పై అణుదాడి అవకాశాలను తోసిపుచ్చిన వైట్‌హౌస్
దేశం కోసం ఆత్మార్పణకు కోటిన్నర మందిమి సిద్ధం: ఇరాన్ అధ్యక్షుడు
సంధికి విధించిన డెడ్‌లైన్ ముగియక ముందే దాడులు
ఖార్గ్ ద్వీపంపై ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం
రైల్వే లైన్లు, వంతెనలే లక్ష్యం
ఇరాన్ పౌరులు రైళ్లు వాడొద్దని ఇజ్రాయెల్ హెచ్చరిక
వాయువ్య ఇరాన్‌లో వైమానిక దాడుల్లో 18 మంది మృతి
వాషింగ్టన్/ టెహ్రాన్, ఏప్రిల్ 7: బాంబు దాడులతో ఎంతగా విధ్వంసం సృష్టిస్తున్నా ఇరాన్ లొంగకపోవటంతో ఆగ్రహంతో రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. విపరీత నిర్ణయం తీసుకునే ప్రమాదం కనిపిస్తోంది. మంగళవారం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇరాన్‌పై అణ్వాయుధ దాడి చేయొచ్చనే అనుమానాలు కలిగించాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేయటంతో ‘అణు’ భయాలు మరింత పెరిగాయి. తాత్కాలిక కాల్పుల విరమణ సంధికి విధించిన గడువు మంగళవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5.30 గంటలకు)తో ముగియగా, అంతకు కొన్ని గంటల ముందు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘ఒక నాగరికత మొత్తం ఈ రాత్రికే (మంగళవారం రాత్రి) అంతం కాబోతోంది. దానిని మళ్లీ వెనక్కు తీసుకురావటం అసాధ్యం. అలా జరగటం నాకు ఇష్టం లేదు. కానీ, తప్పేట్లు లేదు. అక్కడిపాలనను పూర్తిగా మార్చివేసిన తర్వాత.. భిన్నంగా ఆలోచించే తెలివైన వ్యక్తులు కొందరు మిగిలారు. ఎవరికి తెలుసు... ఈ రాత్రికే విప్లవాత్మకమైన పరిణామం జరుగుతుందేమో..!సుదీర్ఘమైన ప్రపంచ చరిత్రలో ఈ రాత్రి ఒక ముఖ్యమైన మార్పును చూడబోతున్నాం. 47 ఏళ్ల నిర్బంధం, అవినీతి పాలన ఎట్టకేలకు అంతం కాబోతోంది’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే జేడీ వాన్స్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘అధ్యక్షుడు మాత్రమే ఉపయోగించగలిగే ఒక వస్తువు (టూల్)ను అమెరికా వాడే అవకాశం ఉంది. మా టూల్‌కిట్లలో ఇప్పటివరకూ వాడాలని నిర్ణయించుకోని ఒక వస్తువు ఉంది. ఆ విషయం వాళ్లు (ఇరాన్) అర్థం చేసుకొంటే మంచిది. ఆ వస్తువును వాడాలా వద్దా? అనేది అమెరికా అధ్యక్షుడు మాత్రమే నిర్ణయించగలరు. ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే దానిని వాడే అంశాన్ని అధ్యక్షుడు పరిశీలిస్తారు’ అని పేర్కొన్నారు.
అణ్వాస్త్రాలను ప్రయోగించేందుకు అవసరమైన కోడ్లు ఉండే బ్రీఫ్‌కేస్ అమెరికా అధ్యక్షుడికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆయన మాత్రమే దానిని యాక్టివేట్ చేయగలరు. దీంతో ఇరాన్‌పై అణ్వాయుధాలు ప్రయోగించబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే, ఈ అంశంపై అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ స్పష్టతనిచ్చింది. ఉపాధ్యక్షుడు చెప్పింది అణ్వస్త్ర దాడి గురించి కాదని.. చాలా మంది అలా భావించి బఫూన్లు అయ్యారని ట్వీట్ చేసింది.
ఖార్గ్‌పై బాంబుల వర్షం
ఇరాన్ చుమురుకు, ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న ఖార్గ్ ద్వీపంపై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దళాలు మంగళవారం బాంబుల వర్షం కురిపించాయి. ఆ ద్వీపంలోని రక్షణ కేంద్రాలతోపాటు 50 చోట్ల బాంబులు వేశామని అమెరికా ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన చమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం ఈ ద్వీపం నుంచే సాగుతున్నాయి. ఇక్కడి నుంచి చమురు ఎగుమతి ఆగిపోతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ ద్వీపం నుంచి రోజుకు 70 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేయవచ్చు. ఏకకాలంలో 7 సూపర్ ట్యాంకర్ నౌకలను లోడ్ చేయవచ్చు. ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే ముడి చమురులో దాదాపు 90 శాతం చైనాకే వెళ్తోంది. ఒకవేళ ఈ దీవి మూతపడితే చైనా కూడా చమురు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా, ఇరాన్‌లోని అల్బోర్జ్ ప్రావిన్స్‌లో మంగళవారం జరిగిన వైమానిక దాడిలో 18 మంది మరణించారు. తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో ఇజ్రాయెల్ కాన్సులేట్ వద్ద దాడులకు ప్రయత్నించిన ఇద్దరు సాయుధులను ఆ దేశ పోలీసులు కాల్చి చంపారు.
వంతెనలు, రైళ్లు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్
ఇరాన్‌లోని పౌర మౌలిక సదుపాయాలను అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. 15 గంటలపాటు ఇరాన్ పౌరులు రైళ్లను వాడొద్దని ఇజ్రాయెల్‌సైన్యం మంగళవారం సూచించింది. ‘రేపు (బుధ వారం) అర్ధరాత్రిలోపు ఇరాన్‌లోని ప్రతి వంతెనను ఽకూల్చేస్తాం. ఒక్క విద్యుత్ కేంద్రం కూడా ఎప్పటికీ పనికిరాకుండా తగులబెట్టేస్తాం’ అని పేర్కొంది. భీకర దాడులతో ఇరాన్ పాలకులను చిదిమేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని పౌర మౌలిక సదుపాయాలన్నింటినీ ధ్వంసం చేస్తామని అమెరికా హెచ్చరించింది. మరోవైపు వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, ప్రజా ఆస్తులను కాపాడుకొనేందుకు సామాన్య ప్రజలతోపాటు కళాకారులు, క్రీడాకారులు వాటి చుట్టూ మానవహారాలుగా ఏర్పడాలని ఆ దేశ క్రీడాశాఖ ఉప మంత్రి అలీరెజా రహీమీ పిలుపునిచ్చారు. ఆయన పిలుపుతో చాలాచోట్ల ప్రజలు ఇరాన్ జాతీయ జెండాలతో మంగళవారం మానవహారాలుగా ఏర్పడ్డారు.
ఎక్కడివారక్కడే ఉండండి: భారత్
యుద్ధం ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో ఇరాన్ లోని భారతీయులకు మన ప్రభుత్వం కీలక సూచన చేసింది. ‘ఇరాన్‌లోని భారతీయులంతా వచ్చే 48 గంటలపాటు ఎక్కడివారు అక్కడే ఉండండి’ అని ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం మంగళవారం సూచించింది. ఇళ్లనుంచి బయటకు రావద్దని, నిత్యం ఎంబసీ అధికారులతో ఫోన్లలో అందుబాటులో ఉండాలని కోరింది.
హోర్ముజ్‌పై తీర్మానానికి చైనా, రష్యా వీటో
హోర్ముజ్ జలసంధిని తెరిపించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బహ్రెయిన్ మంగళవారం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా, చైనా తమ వీటో అధికారాలతో అడ్డుకున్నాయి. తీర్మానానికి అనుకూలంగా 11 ఓట్లు వచ్చినప్పటికీ.. ఈ దేశాల వీటో కారణంగా అది వీగిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ కారణంగానే సమస్య వచ్చిందని, ఆ విషయాన్ని ప్రస్తావించకుండా.. స్వేచ్ఛాయుత నౌకా రవాణా గురించి మాత్రమే పేర్కొనటం సరికాదని చైనా, రష్యా ప్రతినిధులు విమర్శించారు. మరోవైపు ఈ తీర్మానం వీగిపోవటం ప్రపంచానికి తప్పుడు సంకేతాలను పంపిందని బహ్రెయిన్ విదేశాంగ మంత్రి అబ్దుల్లాతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ అన్నారు. కాగా, ఈ తీర్మానంపై ఓటింగ్‌కు పాకిస్థాన్, కొలంబియా దూరంగా ఉన్నాయి.

కోటిన్నర మందిమి సిద్ధంగా ఉన్నాం: పెజెష్కియాన్
ట్రంప్ ప్రకటనపై ఇరాన్ దీటుగా స్పందించింది. దేశాన్ని రక్షించుకొనేందుకు 1.4 కోట్ల మంది ఇరాన్ పౌరులు ప్రాణత్యాగాలకు సిద్ధంగా ఉన్నారని ఆ దేశాధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రకటించారు. అందులో తాను కూడా ఉన్నానని ట్వీట్ చేశారు. ఇరాన్ జనాభా దాదాపు 9 కోట్లు. ప్రపంచంలోనే అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటైన ఇరాన్ దెబ్బ ఎలా ఉంటుందో అమెరికా, దాని మిత్రపక్షాలకు రుచి చూపిస్తామని దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ‘అలెగ్జాండర్ తగులబెట్టాడు. మంగోలులు ప్రతీకారం తీర్చుకున్నారు. చరిత్ర పరీక్ష పెట్టింది. అయినా, ఇరాన్ నిలిచే ఉంది. కాలమే ఏమీ చేయలేకపోయిన ఈ నాగరికత ఇప్పుడు ఒక పిచ్చివాడి బెదిరింపుతో అంతం కాదు’ అని టర్కీలోని ఇరాన్ రాయబార కార్యాలయం పేర్కొంది. కాగా, యుద్ధం తీవ్రమవుతున్న వేళ ఇరాన్‌లోని మైనర్లు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని రివల్యూషనరీ గార్డ్స్ పిలుపునిచ్చింది. ‘తల్లిదండ్రులంతా తమ మైనర్ కుమారులను సైన్యంలోకి పంపి.. వారిని పూర్తిస్థాయి పురుషులుగా తీర్చిదిద్దండి’ అని కోరింది. మరోవైపు అమెరికాతో ఇకపై పరోక్షంగా గానీ ప్రత్యక్ష్యంగా గానీ చర్చలు ఉండవని ఇరాన్ మీడియా సంస్థ టెహ్రాన్ టైమ్స్ తెలిపింది. అయితే, ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల తర్వాత మళ్లీ దౌత్య మార్గాలను తెరిచినట్లు సమాచారం.