Share News

అరబ్ దేశాలు మాతో కలిసి దాడి చేస్తామని అంటున్నాయి: ట్రంప్

ABN , Publish Date - Mar 02 , 2026 | 10:33 PM

అమెరికాతో కలిసి ఇరాన్‌పై దాడి చేస్తామని గల్ఫ్ దేశాలు అంటున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తెలిపారు. అసలు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేయడం తనను కూడా ఆశ్చర్య పరిచిందని వ్యాఖ్యానించారు.

అరబ్ దేశాలు మాతో కలిసి దాడి చేస్తామని అంటున్నాయి: ట్రంప్
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌ దాడులతో అరబ్ దేశాల్లో వ్యతిరేకత పెరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బహ్రెయిన్, జోర్డాన్, కువైత్, ఖతర్, యూఏఈ దేశాలపై ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో స్పష్టమైన మార్పు వచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాతో కలిసి ఉమ్మడిగా ఇరాన్‌పై సైనిక చర్యకు దిగుతామని ముందుకొచ్చాయని చెప్పారు. ఇది తమకూ ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ‘మేము చూసుకుంటామని వాళ్లతో చెప్పాను. కానీ ఇప్పుడు వాళ్లూ రంగంలోకి దిగుతామని అంటున్నారు. మొదట్లో మాత్రం తాము అస్సలు జోక్యం చేసుకోబోమని చెప్పారు’ అని ట్రంప్ మీడియాతో అన్నారు.

ఇరాన్ దాడులను గల్ఫ్ దేశాలు ఖండించాయి. అయితే, సైనిక శక్తి ప్రయోగించడంపై మాత్రం సంయమనం పాటిస్తున్నాయి. తాము రంగంలోకి దిగితే వివాదం మరింత పెద్దదయ్యే అవకాశం ఉందని సందేహిస్తున్నాయి.


కాగా, అరబ్ దేశాల నాయకత్వం చాలా తెలివైన శక్తిమంతమైనదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘ఇరానియన్లు ఒక హోటల్‌పై దాడి చేశారు. ఒక అపార్ట్‌మెంట్‌నూ టార్గెట్ చేశారు. ఇది గల్ఫ్ దేశాలకు మరింత కోపం తెప్పించింది’ అని అన్నారు. గల్ఫ్ దేశాలను ఇరాన్ టార్గెట్ చేయడం చాలా ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. అణ్వాయుధం కోసం ఇరాన్ పట్టుబడుతుండటమే మధ్య ప్రాచ్యంలో అస్థిరతకు ప్రధాన కారణమని అన్నారు. వాళ్లు ఇంతకాలం చీకటి మేఘం నీడలో మనశ్శాంతి లేకుండా ఉన్నారని వ్యాఖ్యానించారు.

ఇరాన్‌ను అమెరికా మిలిటరీ తుక్కు చేస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరో భారీ అల వారి మీదకు రాబోతోందని కూడా చెప్పారు. ఇరాన్‌లో అధికారం అక్కడి ప్రజలకు దక్కేలా అమెరికా చర్యలు తీసుకుంటోందా? అన్న ప్రశ్నకు ట్రంప్ అవునని సమాధానం ఇచ్చారు.


ఇవి కూడా చదవండి

ఇది ముగింపు లేని యుద్ధం కాదు: యూఎస్ మంత్రి పీటర్ హెగ్సెత్

పొరపాటున అమెరికా ఫైటర్ జెట్స్‌ను కూల్చిన కువైత్: పెంటగాన్

Updated Date - Mar 02 , 2026 | 11:37 PM