Share News

ఇది ముగింపు లేని యుద్ధం కాదు: యూఎస్ మంత్రి పీటర్ హెగ్సెత్

ABN , Publish Date - Mar 02 , 2026 | 08:00 PM

ఇరాన్‌పై సైనిక చర్య ముగింపు లేని యుద్ధం కాదని అమెరికా యుద్ధ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ అన్నారు. ఇరాక్‌ యుద్ధంతో పోల్చకూడదని తేల్చి చెప్పారు.

ఇది ముగింపు లేని యుద్ధం కాదు: యూఎస్ మంత్రి పీటర్ హెగ్సెత్
Peter Hegseth

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై దాడులను ఇరాక్‌ యుద్ధంతో పోల్చకూడదని అమెరికా యుద్ధ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ సోమవారం మీడియాతో అన్నారు. ఇరాక్ తరహా ఊబిలోకి అమెరికా పడదలుచుకోలేదని స్పష్టం చేశారు. ఇది ముగింపు లేని యుద్ధం ఎంత మాత్రం కాదని అన్నారు. ఇరాన్ సైనిక శక్తి, అణు లక్ష్యాలను కూల్చేందుకే నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ఇరాన్‌ను ఆక్రమించుకోవాలనో లేదా దేశాన్ని పునర్ నిర్మించాలనో తమ ఉద్దేశం కాదని అన్నారు. ఇరాన్ మిసైళ్లు, డ్రోన్స్‌, నావికాదళాలు, అణు కార్యక్రమాన్ని టార్గెట్ చేస్తూ ఈ మిషన్‌ను ప్రారంభించామన్నారు. ఇరాన్ మొండిఘటంగా మారిందని అన్నారు. తమ సహనం నశించిందని చెప్పారు. ప్రపంచ నౌకాయాన మార్గాలకు రిస్క్ పెరిగిందని అన్నారు. భారీ స్థాయిలో ఇరాన్ ఆయుధాలను సమకూర్చుకుందని అన్నారు. సంప్రదాయక ఆయుధాలతో తన అణు కార్యక్రమానికి రక్షణ కవచాన్ని ఇరాన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. అణ్వాయుధ అభివృద్ధి గురించి అసత్యాలు చెబుతూనే తమ నెత్తికి గన్ను గురిపెట్టిందని అన్నారు.


ఇరాన్‌లో ప్రభుత్వ మార్పే అమెరికా లక్ష్యమన్న ఆరోపణలనూ అమెరికా మంత్రి తోసిపుచ్చారు. ప్రభుత్వంలో మాత్రం మార్పు వచ్చిందని అన్నారు. ఇది ప్రపంచానికి ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు. టెహ్రాన్‌తో కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఘర్షణకు ఈ సైనిక చర్యతో ముగింపు పడిందన్నారు. తాము ఈ ఘర్షణలను ప్రారంభించకపోయినా కూడా ట్రంప్ సారథ్యంలో ముగింపు పలుకుతామని తేల్చి చెప్పారు. అమెరికన్లపై ఇరాన్ యుద్ధానికి అయతుల్లాతో తాము ప్రతీకారం తీర్చుకున్నామని వ్యాఖ్యానించారు. ఇరాన్‌లోని మూర్ఖపు పాలకులకు అణ్వాయుధాలు ఎంత మాత్రం దక్కకూడదని ట్రంప్ మొదటి నుంచీ చెబుతున్నారని గుర్తు చేశారు.


ఇవి కూడా చదవండి

పొరపాటున అమెరికా ఫైటర్ జెట్స్‌ను కూల్చిన కువైత్: పెంటగాన్

ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. భారతీయుడి మృతి

Updated Date - Mar 02 , 2026 | 08:24 PM