Share News

చైనా, భారత్ నరకప్రాయం అన్న రేడియో వ్యాఖ్యాత.. రీపోస్టు చేసిన ట్రంప్

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:06 PM

పుట్టుకతో పౌరసత్వం అందించే విధానానికి ముగింపు పలకాలంటూ ఒక రేడియో వ్యాఖ్యాత చేసిన కామెంట్స్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీపోస్టు చేశారు. చైనా, భారత్‌లు నరకప్రాయం అంటూ ఆ వ్యాఖ్యాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం విమర్శలకు దారితీస్తున్నాయి.

చైనా, భారత్ నరకప్రాయం అన్న రేడియో వ్యాఖ్యాత.. రీపోస్టు చేసిన ట్రంప్
Trump on Birthright citizenship

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన దృష్టిని వలసల అంశంపై మళ్లించారు. యూఎస్‌లో పుట్టుకతో పౌరసత్వం లభించే విధానానికి స్వస్తి పలకాలన్న ఒక కామెంట్‌ను ట్రంప్ తాజాగా రీపోస్టు చేశారు.

అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వం అందించే విధానాన్ని విమర్శిస్తూ అమెరికా రేడియో వ్యాఖ్యాత మైఖేల్ పలు కామెంట్స్ చేశారు. భారత్, చైనా, ఇతర దేశాలు నరకప్రాయమని జాత్యాహంకారాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా చైనా, భారత్‌ నుంచి కొందరు గర్భంతో ఉన్న మహిళలు ప్రెగ్నెన్సీ చివరి నెలల్లో వచ్చి యూఎస్‌లో సంతానానికి జన్మనిస్తున్నారని ఆరోపించారు.


‘తొమ్మిదో నెలలో వారు ఇక్కడ పిల్లల్ని కంటున్నారు. ప్రస్తుత చట్టం కారణంగా ఆ శిశువులు అప్పటికప్పుడు అమెరికా పౌరులు అయిపోతున్నారు. ఆ తరువాత వారు చైనా, భారత్, ఇతర నరకప్రాయ దేశాల నుంచి తమ కుటుంబాల్ని తీసుకొస్తున్నారు’ అని ఆరోపించారు. బర్త్‌ టూరిజంతో ప్రస్తుత చట్టాల్ని దుర్వినియోగ పరుస్తున్నారని ఆరోపించారు. భారతీయులు, చైనా వారు లాప్‌టాప్‌ పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు అని కూడా నోరుపారేసుకున్నారు. అమెరికా రాజ్యాంగం ఇప్పటి వలసల శకానికి తగినది కాదని కూడా చెప్పుకొచ్చారు.

ఈ కామెంట్స్‌ను అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో రీపోస్టు చేశారు. పుట్టుకతో పౌరసత్వం లభించే విధానం మరే దేశంలోనూ లేదని అంతకుముందు రోజు ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే, ప్రస్తుతం 30కి పైగా దేశాలు ఇలాంటి పౌరసత్వాన్ని కల్పిస్తున్నాయి. వీటిల్లో అమెరికాతో పాటు కెనడా, మెక్సికో, ఇతర దక్షిణ అమెరికన్ దేశాలు ఉన్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

హోర్ముజ్‌లో సీమైన్స్‌‌ను తొలగించేందుకు 6 నెలల పట్టవచ్చు: పెంటగాన్

మా ఓడరేవుల దిగ్బంధనం ఆపకపోతే దాడి తప్పదు: ఇరాన్‌ హెచ్చరిక

Updated Date - Apr 23 , 2026 | 12:32 PM