Share News

తుఫాన్‌ ముందు ప్రశాంతత!

ABN , Publish Date - May 18 , 2026 | 02:40 AM

హోర్ముజ్‌ జలసంధిని తెరిచే వ్యవహారం ఎటూ తేలకపోతుండటంతో ఇరాన్‌పై మళ్లీ దాడులకు ట్రంప్‌ సిద్ధమవుతున్నారా? ఆయన ఆదివారం ట్రూత్‌ సోషల్‌లో....

తుఫాన్‌ ముందు ప్రశాంతత!

అల్లకల్లోలపు సముద్రంలో ఇరాన్‌ నౌకలు ఊగిపోతున్నట్టుగా ట్రంప్‌ ఏఐ చిత్రం

ఇరాన్‌పై మళ్లీ దాడులకు ట్రంప్‌ సిద్ధమవుతున్నారనే విశ్లేషణలు

వాషింగ్టన్‌, మే 17: హోర్ముజ్‌ జలసంధిని తెరిచే వ్యవహారం ఎటూ తేలకపోతుండటంతో ఇరాన్‌పై మళ్లీ దాడులకు ట్రంప్‌ సిద్ధమవుతున్నారా? ఆయన ఆదివారం ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేసిన చిత్రం ఈ వాదనకు బలాన్నిస్తోంది. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో ఇరాన్‌ నౌకలు ఊగిపోతున్నట్టుగా ఉన్న ఒక కృత్రిమ మేధ(ఏఐ) చిత్రాన్ని ట్రంప్‌ పోస్టు చేశారు. అందులో ‘అమెరికాను మళ్లీ గొప్పగా చేద్దాం (మగా)’ నినాదం ఉన్న ఎరుపు రంగు టోపీని పెట్టుకుని, యుద్ధనౌకలో నిలబడి ముందుకు సాగుదామంటూ సంకేతమిస్తున్నట్టుగా ట్రంప్‌, ఆయన వెనకాల అమెరికా నేవీ అడ్మిరల్‌ నిలబడి ఉన్నారు. ఈ చిత్రానికి ‘ఇది తుఫానుకు ముందు ప్రశాంతత’ అని క్యాప్షన్‌ పెట్టడం గమనార్హం. ఆ తర్వాత ‘‘సమయం దగ్గరపడుతోంది. అది చాలా విలువైనది. ఇరాన్‌ వెంటనే స్పందించి, నిర్ణయం తీసుకుంటే మంచిది. లేకపోతే వారివద్ద ఇకపై ఏమీ మిగలదు’’ అని హెచ్చరిస్తూ ట్రంప్‌ మరో పోస్టు పెట్టారు.

తుపాకులను ఎలా వాడాలంటే..

కలష్నికోవ్‌, ఇతర మెషీన్‌గన్‌లు, తుపాకులను ఎలా వాడాలనే దానిపై ఇరాన్‌ ప్రభుత్వ టీవీ వరుసగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. ఇరాన్‌ మిలిటరీకి చెందిన అధికారులు తుపాకుల వాడకంపై శిక్షణ ఇస్తున్న తరహాలో వివరాలు వెల్లడిస్తున్నారు. న్యూస్‌ యాంకర్లు ఆయుధాలు పట్టుకుని కనిపిస్తున్నారు. అమెరికా మళ్లీ దాడులకు దిగవచ్చని, యుద్ధం కొనసాగవచ్చని ప్రజలను సిద్ధం చేసేందుకే ఈ ప్రసారాలు చేస్తున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, యూఏఈలోని అల్‌ధాఫ్రా ప్రాంతంలో బరకా అణు విద్యుత్‌ కేంద్రంపై ఆదివారం డ్రోన్‌ దాడి జరిగింది. రియాక్టర్లకు నష్టం జరగలేదని, రేడియోధార్మికత ఏదీ వెలువడటం లేదని యూఏఈ అధికారులు ప్రకటించారు. యూఏఈలో ఉన్న ఏకైక అణు ప్లాంట్‌ అయిన బరకా.. ఆ దేశంలో విద్యుత్‌ అవసరాల్లో 25శాతం తీరుస్తోంది.

దౌత్యం కోసం పాక్‌ ప్రయత్నాలు..

ఇరాన్‌, అమెరికా మధ్య శాంతి ఒప్పందం దిశగా పాకిస్థాన్‌ తన దౌత్యప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. ఇటీవలే అమెరికా, ఇరాన్‌ మధ్య పరస్పరం ప్రతిపాదనలను, డిమాండ్లను చేరవేసింది. పాకిస్థాన్‌ మంత్రి మోహ్సిన్‌ నఖ్వీ ప్రస్తుతం ఇరాన్‌లో చర్చలు జరుపుతున్నారు. ఆదివారం ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌, విదేశాంగ మంత్రి అరాగ్చీలతో, పార్లమెంటు స్పీకర్‌ ఘలీబ్‌ఫతో వేర్వేరుగా భేటీ అయ్యారు. కాగా, అమెరికా తాజాగా పలు ఐదు ప్రతిపాదనలు పంపిందని, కానీ అవేమీ ఆమోదయోగ్యంగా లేవని ఇరాన్‌ మీడియా పేర్కొంది.

Updated Date - May 18 , 2026 | 02:40 AM