గ్రీన్ కార్డు కోసం లక్ష డాలర్ల బాండ్.. పరిశీలనలో కొత్త ప్రతిపాదన
ABN , Publish Date - Jul 16 , 2026 | 08:30 PM
అమెరికాలోకి వలసలను నిరోధించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డుకు సంబంధించి మరో కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోకి వలసలను నిరోధించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డుకు సంబంధించి మరో కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. విదేశాల్లోని యూఎస్ కాన్సులేట్‌ల నుంచి గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకునే కొందరు లక్ష డాలర్ల వరకూ బాండ్ సమర్పించే నిబంధన ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలన దశలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడి కావాల్సి ఉంది.
మీడియా కథనాల ప్రకారం, విదేశాల్లోని కాన్సులేట్లల్లో దరఖాస్తు చేసుకునే కొందరు ఈ బాండ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. గ్రీన్ కార్డు వచ్చాక ఈ మొత్తాన్ని తిరిగిచ్చేస్తారు. మొదట్లో కొన్ని దేశాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ విధానాన్ని ప్రవేశపెట్టే విషయాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, ఏయే దేశాలకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుందనే విషయాన్ని అమెరికా అధికారులు వెల్లడించలేదు.
అమెరికా ఏటా విదేశీయులకు 1.40 లక్షల ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో దేశానికి 7 శాతం మించకుండా వీటిని జారీ చేస్తోంది. గ్రీన్ కార్డుల కోసం భారతీయులు ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటుండటంతో బ్యాక్‌లాగ్స్ పెరిగిపోతున్నాయి. తమ వంతు కోసం అనేక మంది దరఖాస్తుదారులు దశాబ్దాల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అంతేకాకుండా, తక్కువ ఆదాయం ఉన్న వారిని ఈ నిబంధన మరిన్ని కష్టాలపాలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా ఈ బాండ్ అంశాన్ని పరిశీలిస్తోంది. అమలు చేసేందుకు సిద్ధమయ్యాకే ఈ రూల్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
నీకు దమ్ము ఉంటే.. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు పాక్ ఎంపీ సవాల్
న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..