నీకు దమ్ము ఉంటే.. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు పాక్ నేత సవాల్
ABN , Publish Date - Jul 16 , 2026 | 08:06 PM
పాక్ రాజకీయాల్లో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ జోక్యం అంతకంతకూ పెరుగుతున్న తీరుపై స్థానిక రాజకీయ ప్రముఖుడు, మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ తాజాగా అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ రాజకీయాల్లో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ జోక్యం అంతకంతకూ పెరుగుతున్న తీరుపై స్థానిక రాజకీయ ప్రముఖుడు, మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ తాజాగా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆసిమ్ మునీర్‌కు దమ్ము ఉంటే మిలిటరీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలని సవాలు విసిరారు. రాజకీయ వ్యవహారాల్లో మిలిటరీ జోక్యం మితిమీరుతున్న వైనంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
‘నీకు రాజకీయాలు చేయాలని ఉంటే యూనీఫామ్ తొలగించి రాజకీయాల్లోకి రా.. ఎన్నికల్లో పోటీ చేయి. అప్పుడు నీకు ఎన్ని ఓట్లు రాలతాయో తేలిపోతుంది’ అని రెహ్మాన్ మండిపడ్డారు. దేశాన్ని ఎవరు పరిపాలించాలో నిర్ణయించాల్సింది మిలిటరీ కాదని స్పష్టం చేశారు. దేశ జనాభా నియంత్రణకు సంబంధించిన బాధ్యతలను కూడా పాక్ ప్రభుత్వం ఆర్మీ చీఫ్‌కు కట్టబెట్టిన నేపథ్యంలో రెహ్మాన్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదంపై పోరాడేందుకు సామాన్యులు సాయుధ దళాలుగా ఏర్పడాలన్న సూచనపై కూడా రెహ్మాన్ తీవ్రంగా విమర్శించారు. దేశానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, ఆర్మీదేనని స్పష్టం చేశారు. ఇందుకు వారు జీతాలు తీసుకుంటున్నారని కూడా గుర్తు చేశారు. సామాన్య పౌరుల చేతుల్లో ఆయుధాలు పెడితే దీర్ఘకాలిక పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వ్యక్తిగత పగలు ప్రతీకారాలతో కొన్ని తరాలు నాశనమైపోతాయని హెచ్చరించారు. ఇటీవల కాలంలో పాక్ వ్యవహారాలన్నీ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కనుసన్నల్లోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. పౌర ప్రభుత్వం ఆయన చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయింది. ఈ నేపథ్యంలో పాక్ పరిస్థితులపై అనేక మంది స్థానిక నేతలు బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌పై హెచ్చరిక