Share News

అమెరికాలో ఇస్లామిక్ సెంటర్‌లో కాల్పులు.. ముగ్గురి మృతి

ABN , Publish Date - May 19 , 2026 | 11:35 AM

ఇద్దరు యువకులు మసీదు, స్కూలు వద్ద కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అమెరికాలోని ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ శాండియాగోలో సోమవారం చోటుచేసుకుంది.

అమెరికాలో ఇస్లామిక్ సెంటర్‌లో కాల్పులు.. ముగ్గురి మృతి
San Diego mosque shooting

న్యూయార్క్, మే 19: అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది. ఇద్దరు యువకులు మసీదు, స్కూలు వద్ద కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఓ ప్రముఖ అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. 17, 18 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు యువకులు సోమవారం కాలిఫోర్నియాలోని ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ శాండియాగోలోకి చొరబడ్డారు. తుపాకులతో ఇస్లామిక్ సెంటర్‌లోని మసీదు, స్కూలు వద్ద కాల్పులకు తెగబడ్డారు. మసీదు సెక్యూరిటీ గార్డు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. బుల్లెట్ల ధాటికి అతడు ప్రాణాలు కోల్పోయాడు.


మరో ఇద్దరు కూడా ఈ దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాల్పులు జరిపిన తర్వాత ఆ ఇద్దరు యువకులు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఓ నిందితుడు ఇంటినుంచి మూడు ఆయుధాలు తెచ్చుకున్నట్లు సమాచారం. ఆ ఆయుధాలపై ఓ మతానికి వ్యతిరేకంగా నినాదాలు రాసి ఉండటం పోలీసులు గుర్తించారు. మరో నిందితుడు రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు దొరికింది.


ఈ సంఘటనపై ఇస్లామిక్ సెంటర్ ఇమామ్ మాట్లాడుతూ.. ‘కాల్పులు జరిగిన సమయంలో స్కూలులో టీచర్లు, పిల్లలు, స్కూలు సిబ్బంది ఉన్నారు. వారికి ఏమీ కాలేదు. క్షేమంగా ఉన్నారు’ అని తెలిపారు. ఘటనపై శాండియాగో మేయర్ టాడ్ గ్లోరియా మాట్లాడుతూ.. దాడిని తీవ్రంగా ఖండించారు. నగరంలోని ప్రజలు గుర్తింపు, నమ్మకం, ప్రదేశం కారణంగా భయం గుప్పిట్లో బ్రతకాల్సిన పరిస్థితి రాకూడదని అన్నారు. శాండియాగోలో ద్వేషానికి తావులేదని తేల్చి చెప్పారు. ఈ ఘటనను న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తీవ్రంగా ఖండించారు.


ఇవి కూడా చదవండి

గోళ్లను చూసి స్వభావం తెలుసుకోవచ్చా?

సాకులతో కోతలు.. వ్యవసాయ విద్యుత్‌ ఉంటే ఒట్టు

Updated Date - May 19 , 2026 | 12:15 PM