ప్రతీకారమే.. మధ్యవర్తి దేశాలకు తేల్చిచెప్పిన మొజ్తాబా
ABN , Publish Date - Mar 17 , 2026 | 07:09 PM
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల సడలింపు, అమెరికాతో కాల్పుల విరమణకు గల అవకాశాలను ఇరాన్ కొత్త సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ తోసిపుచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకునే విషయంలో కఠిన వైఖరి ప్రదర్శించేందుకే ఆయన కట్టుబడి ఉన్నారు.
టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల సడలింపు, అమెరికాతో కాల్పుల విరమణకు గల అవకాశాలను ఇరాన్ కొత్త సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ(Mojtaba Khamenei) తోసిపుచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకునే విషయంలో కఠిన వైఖరి ప్రదర్శించేందుకే ఆయన కట్టుబడి ఉన్నారు. ఉద్రిక్తతల సడలింపు, కాల్పుల విరమణకు అవకాశాలపై రెండు మధ్యవర్తి దేశాలు చేసిన ప్రతిపాదనను మొజ్తాబా తోసిపుచ్చినట్టుగా ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారని 'రాయిటర్స్' వార్తా సంస్థ తెలిపింది.
అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ఇరాన్ విదేశాంగ విధానంపై జరిగిన తొలి సమావేశంలో మొజ్తాబా కఠిన నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఆ సమావేశానికి మొజ్తాబా స్వయంగా హాజరయ్యారా లేదా అనేదానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. మొజ్తాబా నాయకత్వ పగ్గాలు చేపట్టిన అనంతరం విడుదల చేసిన తొలి లిఖిత పూర్వక ప్రకటనలోనూ యుద్ధంలో పలువురిని పొట్టనపెట్టుకున్నందుకు అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. శత్రువు నుంచి పరిహారం పొంది తీరుతామని అన్నారు. పరిహారం ఇవ్వడానికి నిరాకరిస్తే వాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, కాని పక్షంలో ఆస్తులు ధ్వంసం చేస్తామని పేర్కొన్నారు. ఇంతవరకూ కొంతమేరకు నష్టం చేకూర్చినా అంతిమ లక్ష్యం పూర్తయ్యేంత వరకూ ప్రతీకారమే తమ ప్రాధాన్య క్రమంగా ఉంటుందన్నారు. యుద్ధంలో ఖమెనీ సహా ప్రజలు చిందించిన రక్తానికి ప్రతీకారం తీర్చుకోకుండా వదలేది లేదని చెప్పారు.
రష్యాలో వైద్య చికిత్సకు మెజ్తాబా?
ఫిబ్రవరి 28న టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన తొలి దాడిలో తీవ్రంగా గాయపడిన మొజ్తాబా రష్యాలో చికిత్స పొందేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల ఫోన్ చేశారని, మొజ్తాబాకు రష్యాలో వైద్య చికిత్స అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మొజ్తాబా రష్యా మిలటరీ విమానంలో మాస్కోకు మంగళవారం నాడు బయలుదేరి వెళ్లినట్టు కథనాలు వెలువడుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ సెక్యూరిటీ చీఫ్‌ను చంపేశాం.. ఇజ్రాయెల్ ప్రకటన..
ఇరాన్ యుద్ధం.. భారత్ జోక్యం చేసుకుంటే పరిస్థితులు సద్దుమణుగుతాయి: ఫిన్లాండ్ అధ్యక్షుడు