Share News

మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం.. 567 మిలియన్ డాలర్లు చెల్లించాలని మెటాకు ఆదేశం

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:44 AM

సోషల్ మీడియా దుష్ప్రభావాలకు సంబంధించి ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాకు మరో భారీ షాక్ తగిలింది. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న మైనర్ల చికిత్స, ఇతర కార్యక్రమాల కోసం 567 మిలియన్ డాలర్లు చెల్లించాలని మెటాను న్యూమెక్సికో రాష్ట్రంలోని (అమెరికా) న్యాయస్థానం ఆదేశించింది.

మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం.. 567 మిలియన్ డాలర్లు చెల్లించాలని మెటాకు ఆదేశం
Meta lawsuit

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా దుష్ప్రభావాలకు సంబంధించి ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాకు మరో భారీ షాక్ తగిలింది. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న మైనర్ల చికిత్స, ఇతర కార్యక్రమాల కోసం 567 మిలియన్ డాలర్లు చెల్లించాలని మెటాను న్యూమెక్సికో రాష్ట్రంలోని (అమెరికా) న్యాయస్థానం ఆదేశించింది. బాధిత చిన్నారుల చికిత్స కోసం 420 మిలియన్ డాలర్లు చెల్లించాలని పేర్కొంది. సామాజిక మాధ్యమాల దుష్ప్రభావం, నిరోధం, బాధితులకు వైద్య పరీక్షల కోసం మిగిలిన మొత్తాన్ని వచ్చే ఐదేళ్ల పాటు కేటాయించాలని న్యాయమూర్తి బ్రయన్ బీడ్‌షీడ్ ఆదేశించారు.


ఈ కేసుకు సంబంధించి మెటాకు చుక్కెదురవడం ఇది రెండో సారి. మార్చిలో మొదటి దశ విచారణ సందర్భంగా మెటాపై న్యాయస్థానం 375 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. చిన్నారులపై దుష్ప్రభావాల గురించి తెలిసీ మెటా వారికి హాని తలపెట్టిందని కోర్టు అప్పట్లో అభిప్రాయపడింది. ఫేస్‌బుక్‌లో చిన్నారులకు హానికరమైన కంటెంట్ గురించి తమకు తెలిసిన విషయాల్ని మెటా కావాలనే దాచిపెట్టిందని పేర్కొంది. ఇందుకు పెనాల్టీ చెల్లించాల్సిందేనని ఆదేశించింది.


మెటాలో మౌలిక స్థాయిలో మార్పులకు ఆదేశించాలని ప్రాసిక్యూటర్లు కోర్టును విచారణ సందర్భంగా అభ్యర్థించారు. యూజర్లను సోషల్ మీడియాకు బానిసగా మార్చే ఫీచర్లకు అడ్డుకట్ట వేసేలా మార్పులకు ఆదేశించాలని కోరారు. వయసు ధ్రువీకరణ నిబంధనలను మరింత కట్టుదిట్టం చేయాలని అన్నారు. చిన్నారులకు హానికరమైన కంటెంట్‌పై డీఫాల్ట్‌గా కట్టుదిట్టమైన అకౌంట్ సెట్టింగ్స్ ఉండేలా చర్యలకు ఆదేశించాలని కోరారు. ఈ తీర్పు నేపథ్యంలో మెటాలో మౌలికస్థాయి మార్పులు కనిపించే అవకాశం ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

థాయ్‌లాండ్ స్కూల్‌లో కాల్పులు.. నలుగురి మృతి.. 15 మందికి గాయాలు..

భారతీయులకు యూఎస్ స్టూడెంట్ వీసాల్లో 62 శాతం కోత

Updated Date - Aug 07 , 2026 | 11:55 AM