యూఎస్ పరువు పోయే వరకూ యుద్ధం తప్పదు.. ట్రంప్‌నకు ఇరాన్ సైన్యం వార్నింగ్
ABN , Publish Date - Apr 02 , 2026 | 06:05 PM
యూఎస్ శాశ్వతంగా తన పరువును పోగొట్టుకునే వరకూ ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయని ఇరాన్ సైన్యం తాజాగా స్పష్టం చేసింది. ఇరాన్ సైన్యం బలహీనపడిందన్న ట్రంప్ వ్యాఖ్యలను ఐఆర్‌జీసీ ప్రతినిధి తోసిపుచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఘర్షణల ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటనకు ఇరాన్ సైన్యం (ఐఆర్‌జీసీ) గురువారం ఘాటుగా బదులిచ్చింది. అమెరికా శాశ్వతంగా తన పరువు కోల్పోయే వరకూ యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేసింది. యూఎస్‌కు పశ్చాత్తాపం కలిగే వరకూ, లొంగిపోయేవరకూ ఘర్షణలు కొనసాగుతాయని తేల్చి చెప్పింది.
ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం చాలా బలహీనపడ్డాయని ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ నాయకత్వానికి కూడా ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయని అన్నారు. ఈ కామెంట్స్‌పై ఐఆర్‌జీసీ ప్రతినిధి గురువారం స్పందించారు. ఇరాన్ వ్యూహాత్మక సామర్థ్యాలపై యూఎస్‌కు అవగాహన లేదని అన్నారు. డ్రోన్‌లు, మిసైల్స్‌ను ప్రయోగించే సత్తా తగ్గిపోయిందన్న ట్రంప్ కామెంట్స్‌ను తోసిపుచ్చారు.
ఈ విషయాలపై యూఎస్ వద్ద పూర్తి సమాచారం లేదని చెప్పారు. ఇరాన్ మిసైల్, డ్రోన్‌ల ఉత్పత్తి సామర్థ్యాన్ని, దీర్ఘశ్రేణి లక్ష్యాలపై దాడులు చేసే సామర్థ్యాన్ని ధ్వంసం చేశామని అమెరికా భావించడం తప్పని అన్నారు. ఇలాంటి అంచనాలతో ఊబిలోకి మరింతగా కూరుకుపోవాల్సి వస్తుందని యూఎస్‌ను హెచ్చరించారు. యుద్ధం మొదలుపెట్టిన యుఎస్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.
ఈ వార్తలూ చదవండి:
ఎవరెస్ట్‌పై భారీ స్కామ్.. బేకింగ్ సోడాతో డ్రామా..
ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు!