Share News

ఇలాగైతే హోర్ముజ్‌ను మళ్లీ మూసేస్తాం.. ఇరాన్ మరో వార్నింగ్

ABN , Publish Date - Apr 18 , 2026 | 08:57 AM

తమపై అమెరికా దిగ్బంధనం ఇంకా కొనసాగుతున్న తరుణంలో హోర్ముజ్ కూడా ఎక్కువ కాలం తెరిచి ఉండకపోవచ్చని ఇరాన్ హెచ్చరించింది. చర్చలకు సంబంధించి యూఎస్ ప్రచారం చేస్తున్న అవాస్తవాలను సహించబోమని స్పష్టం చేసింది.

ఇలాగైతే హోర్ముజ్‌ను మళ్లీ మూసేస్తాం.. ఇరాన్ మరో వార్నింగ్
Ghalibaf Trump on Hormuz

ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్‌ జలసంధిని తెరిచినట్టు ఇటీవల ప్రకటించిన ఇరాన్ తాజాగా మరో వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ చుట్టూ దిగ్బంధనాన్ని ట్రంప్ తొలగించకపోతే హోర్ముజ్‌ను మళ్లీ మూసేయాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇరాన్ పోర్టుల నుంచి నౌకల రాకపోకలు జరగకుండా దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ మరోసారి ఘాటు హెచ్చరికలు చేసింది.

‘అమెరికా విధించిన దిగ్బంధనం ఇంకా కొనసాగుతోంది. ఇలాగైతే హోర్ముజ్‌ను ఎక్కువ కాలం పాటు తెరిచి ఉంచలేము. మా అనుమతి తీసుకుని మేము సూచించిన మార్గంలోనే నౌకలు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది’ అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ ఘాలిబఫ్ పేర్కొన్నారు. ఈ విషయంలో ట్రంప్ గంట వ్యవధిలో పెట్టిన 7 పోస్టుల్లోని అంశాలన్నీ అవాస్తవాలని కూడా ఆయన స్పష్టం చేశారు.


దౌత్య ప్రక్రియలకు సంబంధించి అమెరికా ప్రచారం చేస్తున్న అవాస్తవాలను తాము సహించబోమని ఘాలిబఫ్ స్పష్టం చేశారు. ‘ఈ అబద్ధాలతో వారికి యుద్ధంలో ఎలాంటి విజయం దక్కలేదు. చర్చల్లో కూడా అబద్ధాలతో పైచేయి సాధించలేరు. ఇరాన్ దిగ్బంధనం కొనసాగుతున్న వేళ హోర్ముజ్ కూడా ఎక్కువ కాలం తెరిచి ఉండకపోవచ్చు’ అని అన్నారు. కాల్పుల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో వాణిజ్య నౌకలను హోర్ముజ్ తెరిచే ఉంటుందని ఇరాన్ ఇటీవల ప్రకటించింది. ఇరాన్ ప్రకటనను అమెరికా స్వాగతించినప్పటికీ దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని పేర్కొంది. శుద్ధిచేసిన యురేనియం నిల్వలను అప్పగించేందుకు ఇరాన్‌ అంగీకరించిందని ట్రంప్ శుక్రవారం పేర్కొన్నారు. ఇరాన్ మాత్రం ఈ వ్యాఖ్యలను నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది.


ఈ వార్తలనూ చదవండి:

మంచి మిత్రుడు మోదీ: ట్రంప్

యురేనియంపై ఇరాన్‌ తల వంచింది: ట్రంప్

Updated Date - Apr 18 , 2026 | 09:40 AM