హోర్ముజ్‌లో నౌక సీజ్.. పాక్ ప్రధానికి ఇరాన్ అధ్యక్షుడి ఫోన్
ABN , Publish Date - Apr 20 , 2026 | 10:04 AM
తమ నౌకను యూఎస్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా పేర్కొంది. యూఎస్ తీరుపై ఇరాన్ అధ్యక్షుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా ఇరాన్ నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడంతో ఇకపై పరిస్థితి ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడారని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికా తీరుపై పెజెష్కియాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొంది. యూఎస్ బెదిరింపులు, అసంబద్ధమైన డిమాండ్ల కారణంగా అపనమ్మకం పెరిగిందని ఇరాన్ అధ్యక్షుడు అన్నారు. దౌత్యానికి తిలోదకాలు ఇచ్చిన యూఎస్ మోసపూరితంగా పాత పద్ధతిలోనే ముందుకు సాగుతున్నట్టు ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
ఇరాన్, యూఎస్ మాధ్య రాజీ కుదురుస్తామని పాక్ చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 12న ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, యూఎస్‌ల మధ్య జరిగిన చర్చలు ఏటూ తేలకుండా ముగిశాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న 14 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు మరోసారి పాక్ వేదికగా చర్చలు జరపాల్సి ఉండగా తాము సిద్ధంగా లేమని ఇరాన్ ప్రకటించింది. అమెరికా బెదిరింపులు, అసంబ్ధమైన డిమాండ్స్‌యే ఇందుకు కారణమని పేర్కొంది.
ప్రస్తుతం ఇరాన్ నౌక తౌస్కా యూఎస్ కస్టడీలోనే ఉంది. తౌస్కాపై గతంలోనే ఆంక్షలు విధించామని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. నౌకలో తనిఖీలు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
పీక్స్‌కు హోర్ముజ్ ఉద్రిక్తతలు! ఇరాన్ నౌకను సీజ్ చేసిన యూఎస్
అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లల మృతి