యూఎస్‌తో డీల్ మాకు అనుకూలం: ఇరాన్ అధ్యక్షుడు
ABN , Publish Date - Jun 21 , 2026 | 06:01 PM
అమెరికాతో డీల్‌లోని అంశాలు తమకు అనుకూలమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. త్వరలో తాము సాధించిన విజయాలు అందరికీ తెలుస్తాయని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం స్విట్జర్లాండ్ వేదికగా శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బఘర్ ఘలిబాఫ్ తదితరులు పాల్గొంటున్నారు. ఖతార్ దేశ ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్థానిక మీడియాతో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఖతార్‌లోని 6 బిలియన్ డాలర్ల ఇరాన్ నిధులు త్వరలో స్వదేశానికి చేరుతాయని చెప్పారు. అమెరికాతో డీల్‌లోని అంశాలను తమకు అనుకూలమని అన్నారు. తాము సాధించిన విజయాల గురించి త్వరలో అందరికీ తెలుస్తుందని చెప్పారు. గతంలో ఆంక్షల విధింపు సందర్భంగా పేర్కొన్న అనేక అంశాలు ఇరాన్ ప్రజల హక్కు అని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా అంగీకరించారని తెలిపారు.
అణు కార్యక్రమంపై కూడా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు అణుబాంబు దక్కకూడదని అమెరికా షరతు విధించిందని అన్నారు. వాస్తవానికి తామూ అణ్వాయుధాలను అభివృద్ధి చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. ఇదేమీ అమెరికాకు కొత్తగా ఇస్తున్న హామీ కాదన్నారు. తమ అణుకార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమే అని చెప్పారు. ఈ డీల్ తరువాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెత్యన్యాహుకు తీవ్ర నిరాశ తప్పదని కూడా అన్నారు. గల్ఫ్ ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సుస్థిర శాంతి స్థాపన కోసం 60 రోజుల పాటు సుదీర్ఘచర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ చర్చలు నేడు జ్యూరిచ్‌లో (స్విట్జర్లాండ్) మొదలయ్యాయి.
ఈ వార్తలనూ చదవండి:
పశ్చిమాసియాలో శాంతి దిశగా మరో కీలక అడుగు..
భారత్ - ఈయూ ఫ్రీ ట్రేడ్ డీల్.. డిసెంబర్లో సంతకాలు!