Share News

పశ్చిమాసియాలో మళ్లీ చెలరేగిన ఉద్రిక్తతలు.. భారత్ ఆందోళన

ABN , Publish Date - Jul 08 , 2026 | 10:24 PM

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ పరిస్థితిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. సంయమనం పాటించాలని అన్ని వర్గాలను కోరింది.

పశ్చిమాసియాలో మళ్లీ చెలరేగిన ఉద్రిక్తతలు.. భారత్ ఆందోళన
India Expresses Concern Over West Asia Crisis

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో శాంతి స్థాపన ప్రయత్నాలకు విఘాగం ఏర్పడే ముప్పు నెలకొంది. ఈ పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. యూఎస్, ఇరాన్‌లు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. శాంతి స్థాపన దిశగా మళ్లీ చర్చలను ప్రారంభించాలని కోరింది. ఇంధన సరఫరా, వాణిజ్యానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

మళ్లీ చెలరేగిన ఉద్రిక్తతలతో ప్రాంతీయ భద్రత, సుస్థిరత, శాంతియుత వాతావరణం దెబ్బతినే అవకాశం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణం ఉద్రిక్తతలను తగ్గించాలని కోరింది. సామాన్య పౌరుల భద్రతకు చర్యలు తీసుకోవాలని సూచించింది. సంక్షోభ నివారణకు దౌత్యం ఒక్కటే అనుసరణీయమైన మార్గమని హితవు పలికింది. సమస్యకు దీర్ఘకాలిక, శాంతియుత పరిష్కారం కొనుగొనాలని సూచించింది.


ఇరాన్‌తో శాంతిస్థాపన ఒప్పందం కథ ముగిసినట్టేనని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. నేటి రాత్రి ఇరాన్‌పై మళ్లీ తాము భీకర దాడులు చేయవచ్చని హెచ్చరించారు. అంతకుముందు అమెరికా ఇరాన్‌లోని పలు స్థావరాలను అమెరికా టార్గెట్ చేసింది. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ట్రంప్ తాజాగా ఇరాన్‌ను మరోసారి హెచ్చరించారు. ఇరాన్ మాత్రం ట్రంప్ వాదనలను తోసిపుచ్చింది. శాంతి ఒప్పందాన్ని మొదట ఉల్లంఘించింది అమెరికాయేనని తేల్చి చెప్పింది.


ఈ వార్తలనూ చదవండి:

నేటి రాత్రి మళ్లీ దాడులు జరగవచ్చు: యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం 'టైమ్ వేస్ట్': డొనాల్డ్ ట్రంప్

Updated Date - Jul 08 , 2026 | 10:34 PM