Share News

నేటి రాత్రి మళ్లీ దాడులు జరగవచ్చు: యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Jul 08 , 2026 | 07:20 PM

ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై భీకర దాడులు జరిగిన గంటల వ్యవధిలోనే యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వార్నింగ్ ఇచ్చారు. నేటి రాత్రి ఇరాన్‌పై మళ్లీ దాడులు జరగవచ్చని హెచ్చరించారు.

నేటి రాత్రి మళ్లీ దాడులు జరగవచ్చు: యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై భీకర దాడులు జరిగిన గంటల వ్యవధిలోనే యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వార్నింగ్ ఇచ్చారు. బుధవారం రాత్రి ఇరాన్‌పై మళ్లీ దాడులు జరగవచ్చని హెచ్చరించారు. తుర్కియే వేదికగా జరుగుతున్న నాటో సమావేశాల్లో పాల్గొన్న ట్రంప్ విలేకరులతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై మళ్లీ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ‘వాళ్లకు ఒక చిన్న వార్నింగ్ ఇస్తున్నా. మేము నేటి రాత్రి వారిపై మళ్లీ భీకర దాడులు చేయవచ్చు. వాళ్ల తీరు ఏమాత్రం బాలేదు. గత 47 ఏళ్లుగా ఇలాగే చేస్తున్నారు’ అని ట్రంప్ హెచ్చరించారు. వ్యక్తిగత చర్చల్లో చెప్పిన మాటలకు బహిరంగంగా వారు చేసే వ్యాఖ్యలకు పొంతన లేదని అన్నారు. ‘వాళ్ల తీరు పిచ్చిగా ఉంది. ఏదో తేడా కనిపిస్తోంది’ అని అన్నారు.


ఇదిలా ఉంటే, ఇరాన్‌తో శాంతి ఒప్పందం కథ ముగిసిందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపాయి. పలు దేశాల్లో స్టాక్ మార్కెట్లు కుప్పకూలగా ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఇటీవల హోర్ముజ్ జలసంధిలో మూడు ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ సైన్యం దాడులతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా ఇరాన్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత రాడార్ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, 60కి పైగా నౌకలపై దాడులు చేసింది.

ఇక అమెరికా చేస్తున్న ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది. శాంతిస్థాపన కోసం జరిగిన అవగాహన ఒప్పందాన్ని మొదట అమెరికానే ఉల్లంఘించిందని తేల్చి చెప్పింది. ముడి చమురును డాలర్లలో విక్రయించేందుకు గతంలో ఇచ్చిన అనుమతులను యూఎస్ ఉపసంహరించుకోవడంపై ఇరాన్ విమర్శలు గుప్పించింది.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం 'టైమ్ వేస్ట్': డొనాల్డ్ ట్రంప్

గ్రీన్‌కార్డు ఆశావహులు మరింత కాలం ఆగాల్సిందే.. పెర్మ్ దరఖాస్తులకు ఏడాది నిరీక్షణ..

Updated Date - Jul 08 , 2026 | 07:28 PM