హోర్ముజ్ టోల్ ఫీజు.. ట్రంప్ మనసు మార్చిన గల్ఫ్ దేశాలు!
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:52 PM
హోర్ముజ్ టోల్ ఫీజు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గేలా చేయడంలో గల్ఫ్ దేశాలు కీలక పాత్ర పోషించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధి మీదుగా సరకు రావాణపై 20 శాతం టోల్ ఫీజు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించడం ప్రపంచాన్ని నివ్వెరపరిచిన విషయం తెలిసిందే. అయితే, టోల్ ప్రతిపాదనపై ట్రంప్ 24 గంటల వ్యవధిలోనే వెనక్కు తగ్గారు. టోల్ విషయమై ఆయన మనసు మార్చడంలో గల్ఫ్ దేశాలు ముఖ్యపాత్ర పోషించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
వాస్తవానికి టోల్ ఫీజు వద్దని ట్రంప్ సలహాదారులు పదే పదే వారించినట్టు తెలిసింది. ఇది అమెరికా ప్రయోజనాలకే చేటు చేస్తుందని వారు హెచ్చరించారు. ఈ చర్యలతో ఇరాన్ వాదనలకు బలం చేకూరడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు. కానీ ట్రంప్ మాత్రం వెనక్కు తగ్గలేదు. టోల్ విధిస్తున్నామని ట్రంప్ ప్రకటించడంతో గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా కలకలం రేగినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్ దేశాలు వెంటనే రంగంలోకి దిగి టోల్ విషయంలో ట్రంప్ వెనక్కు తగ్గేలా చేశాయి. యూఎస్‌లో పెట్టుబడులను పెంచేందుకు గల్ఫ్ దేశాలు అంగీకరించడంతో ట్రంప్ కూడా కాస్త మెత్తబడ్డట్టు సమాచారం. గల్ఫ్ దేశాలు అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్టు ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు.
ఇరాన్ సెటైర్లు..
హోర్ముజ్‌లో ట్రాఫిక్‌కు సంబంధించి తాము టోల్ వసూలు చేయదలిచినట్టు ఇరాన్ ఎప్పటి నుంచో చెబుతోంది. ఈ నేపథ్యంలో టోల్ వసూలు చేస్తామన్న ట్రంప్ ప్రకటనను తమకు అనుకూలంగా మార్చుకోవడంతో పాటు సెటైర్లు కూడా పేల్చింది. ‘అమెరికా అధ్యక్షుడు 100 శాతం కరెక్ట్. హోర్ముజ్ జలసంధిలో భద్రత కల్పించే వారు కచ్చితంగా టోల్ వసూలు చేయాల్సిందే. ఈ సేవలు అందించిన వారికి పారితోషికం లభించాల్సిందే. కానీ 20 శాతం ఫీజు మాత్రం కాస్త ఎక్కువనే చెప్పాలి. మేమైతే ఇంత వసూలు చేయము. న్యాయంగా ఉంటాము’ అని ఇరాన్ సెటైర్లు పేల్చింది.
ఈ వార్తలనూ చదవండి:
బలూచిస్థాన్‌ను చైనా ఎందుకు నిశితంగా గమనిస్తోంది?
సముద్ర ఓడరేవులను రక్షించుకోవడానికి సాధ్యమైనదంతా చేస్తాం: ఉక్రెయిన్