Share News

నెలరాజు కబుర్లతో..నేలకు ఓరియన్‌

ABN , Publish Date - Apr 12 , 2026 | 03:37 AM

చంద్రుడిపై మరోసారి కాలు మోపాలన్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా లక్ష్యంలో కీలక ముందడుగు విజయవంతంగా పూర్తయింది. ఆర్టెమిస్‌ అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా 1వ తేదీన ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష....

నెలరాజు కబుర్లతో..నేలకు ఓరియన్‌

  • ఆర్టెమిస్‌-2 అంతరిక్ష యాత్ర సక్సెస్‌

  • శాన్‌డియాగో తీరంలో దిగిన వ్యోమనౌక

  • అందులోని వ్యోమగాములు సురక్షితం

  • 10 రోజుల రోదసి యాత్రలో 11,17,659 కిలోమీటర్ల ప్రయాణం

  • చంద్రుడిని దాటి భూమి నుంచి 4,06,771 కిలోమీటర్ల దూరం చేరిక

  • గంటకు 32 కి.మీ. వేగంతో ల్యాండింగ్‌

  • 50 ఏళ్ల తర్వాత చంద్రుడి చెంతకు వెళ్లి వచ్చిన మనుషులు.. నాసా సంబురాలు

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 11: చంద్రుడిపై మరోసారి కాలు మోపాలన్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా లక్ష్యంలో కీలక ముందడుగు విజయవంతంగా పూర్తయింది. ఆర్టెమిస్‌ అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా 1వ తేదీన ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి చేపట్టిన ఆర్టెమిస్‌-2 రోదసి యాత్ర శుక్రవారం విజయవంతంగా పూర్తయింది. స్పేస్‌ లాంచ్‌ సిస్టమ్స్‌ (ఎస్‌ఎల్‌ఎస్‌) ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన ఓరియన్‌ అంతరిక్ష నౌక అమెరికా పశ్చిమ తీరంలోని శాన్‌డియాగో సముద్ర జలాల్లో భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5 గంటల 37 నిమిషాల 27 సెకన్లకు దిగింది. అందులో ప్రయాణించిన అమెరికా వ్యోమగాములు రీడ్‌ వైస్‌మ్యాన్‌, విక్టర్‌ గ్లోవర్‌, క్రిస్టినా కోచ్‌, కెనడా వ్యోమగామి జెరెమీ హాన్‌సెన్‌ క్షేమంగా ఉన్నట్లు నాసా పరిపాలనాధికారి జారెడ్‌ ఐసాక్‌మన్‌ తెలిపారు.

నడిచే వెళ్లిన వ్యోమగాములు

ఓరియన్‌ సముద్రంలో పడిన రెండు గంటల్లో అందులో నుంచి వ్యోమగాములను బయటకు తీసుకువచ్చి, వైద్య పరీక్షల కోసం యూఎస్‌ఎస్‌ జాన్‌ పీ ముర్తా నౌకలోకి తరలించారు. పదిరోజులపాటు అత్యంత తక్కువ ప్రదేశంలో, గురుత్వాకర్షణ లేని వాతావరణంలో ఉన్నవారు సహజంగా భూమిని చేరుకున్న వెంటనే సొంతంగా నడవలేరు. అందుకే అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే వ్యోమగాములను చక్రాల కుర్చీల్లో తరలిస్తుంటారు. ఓరియన్‌ క్యాప్సూల్‌ వద్దకు కూడా సహాయక సిబ్బంది వీల్‌చైర్లను తీసుకెళ్లారు. కానీ, వ్యోమగాములు వాటిని తిరస్కరించి నడిచి వెళ్లారు.

2.jpg


టెన్షన్‌ టెన్షన్‌..

అంతరిక్ష ప్రయాణాల్లో భూమి నుంచి వెళ్లటం కంటే.. తిరిగి వచ్చే ప్రక్రియే అత్యంత ప్రమాదకరం. వ్యోమనౌక భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే అగ్నిగోళంలా మండిపోతుంది. కొద్దిసేపు భూమిపై ఉన్న నియంత్రణ వ్యవస్థలతో కూడా దానికి సంబంధాలు తెగిపోతాయి. ఆ సమయంలో వ్యోమనౌకలో ఏ చిన్న లోపం తలెత్తినా.. ప్రమాదం ఊహించలేనంతగా ఉంటుంది. ఓరియన్‌ వ్యోమనౌక కూడా భూ వాతావరణంలోకి ప్రవేశించిన సమయంలో దాదాపు 2,700 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వరకు వేడెక్కి.. సూర్యుడిలా మారిపోయింది. అది భూ వాతావరణంలోకి గంటకు 39,693 కిలోమీటర్ల వేగంతో ప్రవేశించింది. సముద్రంలో పడే సమయానికి దానిలోని పారాచ్యూట్లు తెరుచుకొని, వేగం తగ్గి.. గంటకు 32 కిలోమీటర్లకు చేరింది. భూమికి 3,200 కిలోమీటర్ల దూరంలో ఉండగా, వేడి కారణంగా ఓరియన్‌తో ఆరు నిమిషాలపాటు సంబంధాలు తెగిపోయాయి.

ఆర్టెమిస్‌-2 యాత్ర సాగిందిలా..

ఏప్రిల్‌ 1-2: కెనడీ స్పేస్‌ స్టేషన్‌ నుంచి ఆర్టెమిస్‌-2 యాత్ర మొదలైంది. ఓరియన్‌ వ్యోమనౌక విడిపోయి భూ కక్ష్యలోకి ప్రవేశించింది. భూ కక్ష్యలో తిరుగుతున్నప్పుడే వ్యోమగాములు ఓరియన్‌లోని అన్ని వ్యవస్థలు సరిగా పనిచేస్తున్నాయా లేదా? అని చెక్‌ చేశారు.

ఏప్రిల్‌ 2-5: రెండో తేదీన చంద్రుడి దిశగా ప్రయాణించేందుకు ఓరియన్‌ వ్యోమనౌక గంటకు 22 వేల మైళ్ల వేగాన్ని అందుకునేలా చేశారు. ఆ తర్వాత మూడు రోజుల్లో అది 2,40,000 మైళ్లు ప్రయాణించి, వాన్‌ అలెన్‌ రేడియేషన్‌ బెల్ట్‌ను దాటి, సుదూర రోదసిలోకి ప్రవేశించింది.

ఏప్రిల్‌ 5-6: ఐదో తేదీన వ్యోమనౌక చంద్రుడి సమీపానికి చేరుకుంది. కానీ, దాని కక్ష్యలోకి ప్రవేశించలేదు. వ్యోమగాములు చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన స్పష్టమైన ఫొటోలు తీశారు. ఈ సమయంలోనే అపోలో-13 మిషన్‌ను అధిగమించి రికార్డు స్థాయిలో భూమి నుంచి 4,06,771 కిలోమీటర్ల దూరానికి ఓరియన్‌ వ్యోమనౌక చేరుకుంది. అంతరిక్షంలో మనిషి ప్రయాణించిన అత్యధిక దూరం ఇదే. భూమి నుంచి చంద్రుడి దూరం 3,84,400 కిలోమీటర్లు మాత్రమే.

ఏప్రిల్‌ 6-10: ఈ సమయంలో తిరుగు ప్రయాణం కోసం మరోసారి వ్యోమనౌకలోని వ్యవస్థలన్నింటినీ క్షుణ్ణంగా పరీక్షించారు. ముఖ్యంగా వ్యోమనౌక హీట్‌ షీల్డ్‌ను చెక్‌ చేశారు. ఈ వ్యోమనౌకలో అత్యధికం స్వయం చాలకంగా పనిచేసే వ్యవస్థలే ఉన్నాయి. దీంతో వ్యోమగాములకు అదనపు శ్రమ తప్పింది. పూర్తి పరిశీలన తర్వాత ఓరియన్‌ వ్యోమనౌక భూమికి తిరుగు పయనమయ్యింది.

ఏప్రిల్‌ 11: ముందుగా నిర్దేశించిన ప్రకారం అమెరికా పశ్చిమ భాగంలోని శాన్‌డియాగో తీరంలో వ్యోమనౌక సురక్షితంగా దిగింది. దీనికి ఎంహెచ్‌-60 ఎస్‌ సీహాక్‌ హెలికాప్టర్లు రక్షణ కల్పించాయి. ఓరియన్‌ క్యాప్సూల్‌ నీటిలో పడిన తర్వాత రెండు గంటలకు దానిలోంచి వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత మిషన్‌ కవూండర్‌ రీడ్‌ వైస్‌మ్యాన్‌ మాట్లాడుతూ.. ‘మేము తిరిగి వచ్చాం. కానీ, ఇది అంతం కాదు.. ఆరంభం’ అని వ్యాఖ్యానించారు.


హీట్‌ షీల్డ్‌కు పగుళ్లు?

భూమికి తిరిగి వస్తున్న సమయంలో తీవ్రమైన వేడికి ఓరియన్‌ క్యాప్సూల్‌ హీట్‌షీల్డ్‌ (వేడిని తట్టుకొనే క్యాప్సూల్‌ పైపొర)లో సూక్ష్మమైన పగుళ్లు ఏమైనా వచ్చాయా అనేది పరిశీలిస్తున్నట్లు ఓరియన్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ హోవార్డ్‌ హు తెలిపారు. నాసా చేపట్టిన అపోలో మిషన్ల నుంచి ఇప్పటివరకు వ్యోమనౌకల హీట్‌షీల్డ్‌ తయారీకి ‘అవ్‌కోట్‌’ అనే ప్రత్యేక పదార్థాన్ని వాడుతున్నారు. భవిష్యత్తులో చేపట్టే ప్రయోగాలకు ఇంతకంటే ఉత్తమమైన పదార్థాన్ని వాడే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు హు వివరించారు.

ఆర్టెమిస్‌ విశేషాలు..

  • ఈ యాత్ర ద్వారా చంద్రుడి సమీపానికి వెళ్లిన తొలి అమెరికాయేతర వ్యోమగామిగా కెనడాకు చెందిన జెరెమీ హాన్‌సెన్‌ రికార్డు నెలకొల్పారు.

  • మూన్‌ మిషన్‌లో భాగమైన తొలి నల్లజాతి వ్యోమగామిగా విక్టర్‌ గ్లోవర్‌ చరిత్ర సృష్టించారు.

  • చంద్రుడి యాత్రకు వెళ్లిన తొలి మహిళగా క్రిష్టినా కోచ్‌ రికార్డు నెలకొల్పారు.

  • 10 రోజుల యాత్ర కోసం వ్యోమగాములకు వ్యోమనౌకలో 189 రకాల ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచారు.

  • వ్యోమగాములు నిద్ర నుంచి మేల్కోనేందుకు నాసా అధికారులు పాటలు వినిపించేవారు.

  • ఈ యాత్రలో భాగంగా మనుషులు అంతరిక్షంలో శ్వాస తీసుకోవటం, ఆహారం తీసుకోవటానికి అవసరమైన వ్యవస్థలను పరీక్షించారు.

  • అత్యవసర పరిస్థితుల్లో వ్యోమనౌకను మాన్యువల్‌గా నియంత్రించటపై అధ్యయనం చేశారు.

  • చంద్రుడిపై రేడియేషన్‌ ప్రభావం వ్యోమగాములపై ఎలా ఉంటుందనేదాన్ని పరిశీలించారు.

  • వచ్చే ఏడాది ఆర్టెమిస్‌-3 యాత్ర ద్వారా లూనార్‌ లాండర్‌తో వ్యోమగాముల క్యాప్సూల్‌ అనుసంధాన ప్రక్రియను పరీక్షించనున్నారు. 2028లో ఆర్టెమిస్‌ -4తో చంద్రుడిపైకి వ్యోమగాములను పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

లోపాలను సరిచేసుకొని..

ఆర్టెమిస్‌-2 మిషన్‌లో నాసా చాలా జాగ్రత్తలు తీసుకుంది. అయినా, కొన్ని లోపాలు తలెత్తాయి. ఓరియన్‌ వ్యోమనౌకలో దాదాపు 80ు వ్యవస్థలు స్వయంచాలకంగా పనిచేసేవే అయినా.. కొన్ని సమస్యలను వ్యోమగాములు స్వయంగా బాగుచేసుకోక తప్పలేదు. ముఖ్యంగా క్యాప్సూల్‌లోని టాయ్‌లెట్‌ పనిచేయకపోవటంతో క్రిస్టినా కోచ్‌ దానిని బాగు చేశారు. రోదసిలోని చలికి నౌకలోని టాయ్‌లెట్‌లో మూత్రం గడ్డకట్టి అది మరోసారి పాడైంది. దీంతో వ్యోమనౌకలోని ఆ భాగంపై సూర్యకాంతి ప్రసరించేలా మొత్తం నౌకనే తిప్పారు. దీంతో వేడికి మూత్రం మళ్లీ ద్రవరూపంలోకి మారి పరిస్థితి అదుపులోకి వచ్చింది. యాత్రలో ఆరోరోజు సూర్యకాంతి తాకిడికి వ్యోమనౌక కిటికీల గుండా లోపలికి వేడి అధికంగా రావటంతో టీ షర్టులతో వాటిని మూసివేయాల్సి వచ్చింది.

Updated Date - Apr 12 , 2026 | 03:37 AM