విద్యార్థి వీసాలపై నాలుగేళ్ల కాలపరిమితి!
ABN , Publish Date - Jun 25 , 2026 | 06:44 AM
హెచ్1బీ వీసాల దరఖాస్తు ఫీజును విపరీతంగా పెంచేసి విదేశీ ఉద్యోగుల రాకను నియంత్రించేందుకు ప్రయత్నించిన ట్రంప్ సర్కారు.. తాజాగా విదేశీ విద్యార్థి వీసాలపై...
అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం
న్యూయార్క్, జూన్ 24: హెచ్1బీ వీసాల దరఖాస్తు ఫీజును విపరీతంగా పెంచేసి విదేశీ ఉద్యోగుల రాకను నియంత్రించేందుకు ప్రయత్నించిన ట్రంప్ సర్కారు.. తాజాగా విదేశీ విద్యార్థి వీసాలపై కన్నేసింది! అమెరికాలో విదేశీ విద్యార్థులు ఎంతకాలం చదువుకోవాలనుకుంటే అంతకాలం అక్కడే ఉండే అవకాశం కల్పించే ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ విధానానికి స్వస్తి పలికి.. వారికి నిర్ణీత కాలపరిమితితో కూడిన వీసాలు జారీ చేయాలంటూ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం చేసిన ప్రతిపాదనకు అమెరికా అధ్యక్ష భవనం ఆమోదం తెలిపింది. నిర్ణీత కాలపరిమితి అంటే.. గరిష్ఠంగా నాలుగేళ్లు అని ‘బ్లూమ్‌బెర్గ్’ వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానం ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులు వీసా నిబంధనలను పాటిస్తూ తమ కోర్సు కొనసాగించినంతకాలం అమెరికాలో ఉండొచ్చు. ఉదాహరణకు.. పీహెచ్‌డీ చేసే విద్యార్థి అందుకు ఐదేళ్లు, ఏడేళ్లు.. ఎంతకాలం పట్టినా అంతకాలం ఉండొచ్చు. అలాగే.. విద్యార్థులు తమ చదువును పొడిగించుకోవడానికి, ఒక విశ్వవిద్యాలయం నుంచి మరో యూనివర్సిటీకి మారడానికి, విద్యా కోర్సులను మార్చుకోవడానికి కొత్తగా అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోకుండానే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లేదా స్టెమ్ ఓపీటీ పూర్తి చేయడానికి ప్రస్తుత విధానం అవకాశాన్నిస్తోంది. అమెరికాలో చదువుకునేందుకు ఏటా అత్యధికంగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువ. కాబట్టి, తాజా నిర్ణయంతో మన విద్యార్థులపైనే ఎక్కువగా ప్రభావం పడనుంది. 2023-24 విద్యాసంవత్సరంలో 3.31లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య నిమిత్తం అమెరికాలోని విద్యాసంస్థల్లో చేరారు.
ఇవి కూడా చదవండి
సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!
టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!