రేపటి నుంచీ సుంకాల విధింపు నిలిపివేత! అమెరికా కస్టమ్స్ శాఖ ప్రకటన
ABN , Publish Date - Feb 23 , 2026 | 12:50 PM
ఆర్థిక ఎమర్జెన్సీ కింద ఇప్పటివరకూ విధించిన సుంకాలను మంగళవారం నుంచి నిలిపివేస్తున్నట్టు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ శాఖ తాజాగా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: దిగుమతులపై సుంకాల విధింపును మంగళవారం నుంచీ నిలిపి వేయనున్నామని అమెరికా కస్టమ్స్ శాఖ తాజాగా ఒక ప్రకటనలో తెెలిపింది. ఆర్థిక ఎమర్జెన్సీ పేరిట ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్న సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్స్ ప్రొటెక్షన్ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ చట్టం (ఐఈఈపీఏ) కింద సుంకాల వసూళ్లను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. అమెరికా కాలమానం ప్రకారం, మంగళవారం అర్ధరాత్రి 12.01 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది (US to stop collecting Trump tariffs Under IEEPA).
సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన మూడు రోజులకు కస్టమ్స్ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. వెంటనే సుంకాల వసూలును ఎందుకు నిలిపివేయలేదో చెప్పలేదు. ఇప్పటివరకూ వసూలు చేసిన సుంకాల డబ్బును రీఫండ్ చేయడంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతులపై కొత్తగా 10 శాతం కనీస సుంకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దాన్ని 15 శాతానికి పెంచారు. ఐఈఈపీఏ చట్టానికి బదులు వాణిజ్య చట్టం-1974లోని సెక్షన్ 122 కింద సర్‌చార్జ్ పేరిట ఈ సుంకాలకు తెరతీశారు. అయితే, అమెరికా చట్టసభల అనుమతి లేనిదే వీటిని కూడా 150 రోజులకు మించి పొడిగించే అవకాశం లేదు. ఇక జాతీయ భద్రత పేరిట స్టీల్, అల్యూమినియం, సెమీకండక్టర్స్, ఆటో రంగాలపై గతంలో విధించిన సుంకాలనూ ట్రంప్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శాశ్వత ప్రాతిపదికన సుంకాలు విధించేందుకు మార్గాలను అన్వేషించాలని వాణిజ్య విభాగానికి ఆయన సూచించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తలనూ చదవండి:
సుంకాల డబ్బును తిరిగివ్వండి! ట్రంప్‌నకు అమెరికన్ల డిమాండ్