ఇక భూతల దాడులు!
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:06 AM
ఇరాన్‌పై యుద్ధం ఎటూ తేలని స్థితి, చమురు ధరల పెరుగుదల, గ్యాస్ కొరతతో ప్రపంచ దేశాలు అల్లాడుతుండటంతో.. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా తీవ్రస్థాయి యుద్ధానికి సన్నద్ధమవుతోంది.
హోర్ముజ్ విముక్తికి సిద్ధమైన అమెరికా
ఇరాన్ తీర ప్రాంతాలు, దీవుల స్వాధీనానికి ప్రణాళిక
పశ్చిమాసియావైపు ట్రిపోలి, బాక్సర్ యుద్ధ నౌకలు
నౌకల నుంచి తీరానికి చేరుకుని దాడి చేసే ‘యాంఫిబియస్ రెడీ గ్రూపు’ బలగాల తరలింపు
తక్కువ ఎత్తులో ప్రయాణించే హ్యారియర్, ఏ-10 విమానాలు, అపాచీ హెలికాప్టర్లు కూడా..
కీలకమైన ఖార్గ్ దీవి స్వాధీనం దిశగా అడుగులు
ఇరాక్ నుంచీ బలగాలను తరలిస్తున్న అగ్రరాజ్యం
హోర్ముజ్ భద్రత కోసం వస్తామన్న ఆరు దేశాలు
సైనికపరంగా జోక్యం చేసుకోవడంపై అస్పష్టత
రష్యా చమురుపై మరోసారి ఆంక్షల సడలింపు
కొత్త సాధారణ లైసెన్స్ జారీ చేసిన అమెరికా
ఇరాన్ చమురుపైనా ఆంక్షలు ఎత్తేసే యోచన
వాషింగ్టన్/న్యూఢిల్లీ, మార్చి 20: ఇరాన్‌పై యుద్ధం ఎటూ తేలని స్థితి, చమురు ధరల పెరుగుదల, గ్యాస్ కొరతతో ప్రపంచ దేశాలు అల్లాడుతుండటంతో.. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా తీవ్రస్థాయి యుద్ధానికి సన్నద్ధమవుతోంది. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలోని ఇరాన్ తీర ప్రాంతాన్ని, దీవులను తమ ఆధీనంలోకి తెచ్చుకునే దిశగా వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. వైమానిక దళం, నేవీతోపాటు ఆర్మీతో ముప్పేట దాడులకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం పశ్చిమాసియా ప్రాంతానికి భారీ స్థాయిలో బలగాలను తరలిస్తోంది. ఇప్పటికే జపాన్‌లోని ఒకినావా స్థావరం నుంచి యూఎస్‌ఎస్ ట్రిపోలీ యుద్ధ నౌక పశ్చిమాసియాకు బయలుదేరింది. నౌక నుంచి బయటికి వచ్చాక నీటిపై ప్రయాణించి, తీరానికి చేరుకున్నాక భూమిపై ప్రయాణిస్తూ దాడులు చేసే ‘యాంఫిబియస్ వాహనాల’తో కూడిన యాంఫిబియస్ రెడీ గ్రూప్ ఆ నౌకలో ఉంది. నౌకలో 2వేల మంది యాంఫిబియస్ సిబ్బందితోపాటు మరో 2,200 మంది మెరైన్ బలగాలు కూడా ఉన్నాయి. ఈ నౌకలపై ఉండే ఎఫ్-35బి, ఏ-10 వార్ట్‌హాగ్స్, హ్యారియర్, సైనికులను, ఆయుధాలను తరలించే ఎంవీ-22 ఓస్ర్పే ఎయిర్‌క్రా్‌ఫ్టలు, అపాచీ హెలికాప్టర్లతో పదాతి దళాలకు అవసరమైన సహాయం అందుతుంది. శాన్‌డియాగో నుంచి యూఎస్‌ఎస్ బాక్సర్ యాంఫిబియస్ అసాల్ట్ షిప్ కూడా 2,200మంది సైనికులతో పశ్చిమాసియా వైపు బయలుదేరినట్టు అమెరికా రక్షణ వర్గాలు వెల్లడించాయి.
తీర ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేలా..
హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్‌కు కీలకమైన ఖెష్మ్ దీవితోపాటు హోర్ముజ్, హెంగమ్, లారక్ ద్వీపాలు ఉన్నాయి. దానికితోడు వందల కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం జలసంధిలో ప్రయాణించే నౌకలకు అత్యంత సమీపంలో ఉంటుంది. ప్రస్తుతం ఈ దీవులు, తీర ప్రాంతాల నుంచే నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ దీవులను, తీర ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్టు రక్షణ వర్గాలు చెబుతున్నాయి. యాంఫిబియస్ నౌకల నుంచి తీర ప్రాంతానికి బలగాలను పంపడం, సైనిక రవాణా హెలికాప్టర్ల ద్వారా కీలక ప్రాంతాలకు సైనికులను చేరవేసి దాడులకు దిగేందుకు రంగం సిద్ధమవుతోందని అంటున్నాయి. పదాతి దళాలకు సాయంగా ఏ-10 వార్ట్‌హాగ్స్, హ్యారియర్ విమానాలు దాడులు చేస్తాయని.. నౌకల నుంచి కూడా సాయం అందుతుందని వివరిస్తున్నాయి.
ఖార్గ్ ద్వీపాన్ని ఆక్రమించే వ్యూహం
ఇరాన్‌కు ఆయువుపట్టు అయిన ఖార్గ్ దీవిని స్వాధీనం చేసుకునే దిశగా ట్రంప్ యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు రక్షణ శాఖ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ కథనం ప్రచురించింది. ఇరాన్ చేసే చమురు ఎగుమతుల్లో 90శాతానికిపైగా ఈ ద్వీపం మీదుగానే జరుగుతుంది. దీనిని స్వాధీనం చేసుకుంటే.. ఇరాన్ ఆర్థిక మూలాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అమెరికా భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఖార్గ్ దీవిలోని ఇరాన్ సైనిక స్థావరాలు, వ్యవస్థలను అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో ధ్వంసం చేశాయి.
ఇరాక్ నుంచి బలగాల తరలింపు!
కొన్నేళ్లుగా ఇరాక్‌లో ఉన్న నాటో బలగాలను అక్కడి నుంచి తరలిస్తున్నారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బలగాలు వెనక్కి వెళ్లిపోతున్నాయని, పరిస్థితులు చక్కబడగానే తిరిగి వస్తాయని ఇరాక్ జాతీయ భద్రత విభాగం ప్రతినిధి సయీద్ అల్ జయషి వెల్లడించారు. ఇరాక్‌లో ఉన్న నాటో బలగాల్లో చాలా వరకు అమెరికా సైనికులేనని, ఖార్గ్ దీవి ఆక్రమణ దిశగా వారిని వినియోగించుకోవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
హోర్ముజ్ భద్రత కోసం వస్తాం
ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభ పరిస్థితి తలెత్తుతుండటంతో.. హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణా భద్రంగా సాగే చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధమని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, కెనడా, జపాన్ తదితర దేశాలు వెల్లడించాయి. ఈ మేరకు శుక్రవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అయితే ఏ తరహా సాయం చేస్తాయన్నదానిపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పశ్చిమాసియాకు యుద్ధ నౌకలు పంపడానికి, సైనిక పరంగా జోక్యం చేసుకోవడానికి ఆ దేశాలు ఇప్పటికే నిరాకరించడం గమనార్హం.