బాగ్దాద్‌లో అమెరికన్ జర్నలిస్ట్ కిడ్నాప్.. రంగంలోకి దిగిన యూఎస్ దర్యాప్తు సంస్థలు
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:31 PM
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఒక అమెరికన్ జర్నలిస్ట్‌ను కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన వెనుక ఇరాన్ మద్దతు ఉన్న కతాయిబ్ హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ హస్తం ఉన్నట్లు అమెరికా అనుమానిస్తోంది.
ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 1: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఒక అమెరికన్ జర్నలిస్ట్‌ను కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన వెనుక ఇరాన్ మద్దతు ఉన్న కతాయిబ్ హిజ్బుల్లా (Kataib Hezbollah) మిలిటెంట్ గ్రూప్ హస్తం ఉన్నట్లు అమెరికా అనుమానిస్తోంది. కిడ్నాప్‌కు గురైన వ్యక్తిని ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షెల్లీ కిటిల్సన్ (Shelly Kittleson)గా గుర్తించారు. ఈమె 'అల్-మానిటర్' (Al-Monitor) వంటి ప్రముఖ వార్తా సంస్థలకు పని చేస్తున్నారు.
బాగ్దాద్‌లోని సాదూన్ వీధిలో ఈమె ప్రయాణిస్తున్న కారును రెండు వాహనాలు అడ్డగించి, ఆమెను బలవంతంగా తీసుకెళ్లినట్లు సమాచారం. కిడ్నాపర్ల వాహనాన్ని ఇరాక్ భద్రతా దళాలు వెంబడించగా, బాబిల్ ప్రావిన్స్ సమీపంలో వారి వాహనాల్లో ఒకటి బోల్తా పడింది. అయితే, కిడ్నాపర్లు ఆమెను మరో వాహనంలోకి మార్చి తప్పించుకున్నారు.
ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఒక నిందితుడిని ఇరాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తికి కతాయిబ్ హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపుతో సంబంధాలు ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికారి డైలాన్ జాన్సన్ ధృవీకరించారు.
కాగా, షెల్లీ కిటిల్సన్‌కు ప్రాణహాని ఉందని, ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని అమెరికా విదేశాంగ శాఖ గతంలోనే హెచ్చరించినట్లు సమాచారం. 2023లో ఎలిజబెత్ త్సుర్కోవ్ అనే పరిశోధకురాలిని కూడా ఇదే విధంగా కిడ్నాప్ చేసి, 2025లో విడుదల చేశారు. ఆ సమయంలో కూడా కతాయిబ్ హిజ్బుల్లాపైనే ఆరోపణలు వచ్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్‌లో విదేశీయులకు, ముఖ్యంగా అమెరికన్లకు ముప్పు పెరిగిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక, ఇరాక్ భద్రతా దళాలు జర్నలిస్ట్ కిటిల్సన్ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఆమెను క్షేమంగా విడిపించేందుకు అమెరికా ఎఫ్.బి.ఐ (FBI), ఇతర దర్యాప్తు సంస్థలు ఇరాక్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నాయి. కిటిల్సన్ క్షేమంగా తిరిగి రావాలని 'అల్-మానిటర్', ఇతర మీడియా సంస్థలు ఆకాంక్షిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ అణు కేంద్రక నగరంపై అమెరికా దాడులు.. వీడియో షేర్ చేసిన ట్రంప్..
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిపాదించిన సంచలన ప్రణాళిక