Share News

నెతన్యాహు ఫోన్ కాల్‌తో చర్చలు విఫలం? ఇరాన్ మీడియాలో కథనం

ABN , Publish Date - Apr 13 , 2026 | 01:09 PM

యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కాల్ తరువాత చర్చల్లో పీటముడి పడిందంటూ ఇరాన్ వార్తా సంస్థ ఒకటి ప్రచురించిన కథనం ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది.

నెతన్యాహు ఫోన్ కాల్‌తో చర్చలు విఫలం? ఇరాన్ మీడియాలో కథనం
Benjamin Netanyahu - US, Iran Talks

ఇంటర్నెట్ డెస్క్: పాక్‌ వేదికగా యూఎస్, ఇరాన్ మధ్య జరిగిన చర్చలు ఎటూ తేలకుండా ముగిశాయి. దీంతో, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. డీల్ కుదరకపోవడానికి అవతలి వారే కారణమంటూ యూఎస్‌, ఇరాన్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. అయితే, ఈ పరిణామాల వెనుక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఉన్నట్టు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్జీ ఆరోపించినట్టు వార్తలు రావడం ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది.

ఇరానీయన్ వార్తా సంస్థ ప్రెస్ టీవీ ఈ కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్ పాత్రపై మంత్రి అరాగ్చీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారని చెప్పుకొచ్చింది. చర్చల సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు యూఎస్ ఉపాధ్యక్షుడు వాన్స్‌కు ఫోన్ చేసినట్టు మంత్రి అరాగ్చీ చెప్పారని ప్రెస్ టీవీ పేర్కొంది. దీంతో, ఇజ్రాయెల్ ప్రయోజనాల వైపు చర్చలు మళ్లాయని మంత్రి చెప్పినట్టు పేర్కొంది. యుద్ధంతో సాధించలేనిది చర్చల ద్వారా సాధిద్దామని యూఎస్ భావించినట్టు ఆయన అన్నారు. అయితే, ఈ పోస్టు అరాగ్జీ టైమ్‌లైన్‌లో కనిపించకపోవడంతో అసలు తెరవెనుక ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది.


ఇక డీల్ కుదరకపోవడంపై మంత్రి అరాగ్చీ తాజాగా ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. 47 ఏళ్ల తరువాత యూఎస్‌తో జరిగిన అత్యున్నత స్థాయి చర్చల్లో ఇరాన్ చిత్తశుద్ధితో పాల్గొందని చెప్పారు. డీల్ అంగుళాల దూరంలో ఉండగా యూఎస్ అసాధారణ డిమాండ్స్‌ తేవడం, చర్చల లక్ష్యాన్ని పలుమార్లు మార్చడం వంటివి ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. అసలు గుణపాఠాలు ఏమీ నేర్చుకోలేదని కూడా విచారం వ్యక్తం చేశారు. హోర్ముజ్ జలసంధిని తెరవడం, అణు కార్యక్రమాన్ని వదులుకునేందుకు ఇరాన్ ఇష్టపడకపోవడంతోనే డీల్‌ కుదరలేదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఈ వార్తలూ చదవండి:

దాడుల్లో దెబ్బతిన్న గాంధీ హాస్పిటల్.. వీడియో షేర్ చేసిన ఇరాన్ ఎంబసీ

చర్చల్లో ప్రతిష్టంభన.. ట్రంప్ తదుపరి వ్యూహం ఇదేనా?

Updated Date - Apr 13 , 2026 | 01:27 PM