రేపు ఇస్లామాబాద్‌లో ‘కాల్పుల విరమణ’ చర్చలు
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:12 AM
పశ్చిమాసియాలో శాంతి కోసం పాకిస్థాన్ వేదికగా అడుగులు పడుతున్నాయి. శనివారం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ...
అమెరికా తరఫున జేడీ వాన్స్ బృందం.. ఇరాన్ నుంచి గలీబఫ్, అరాగ్చీ
మధ్యవర్తులుగా పాక్ ప్రధాని షెహబాజ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్
ఇస్లామాబాద్, ఏప్రిల్ 9: పశ్చిమాసియాలో శాంతి కోసం పాకిస్థాన్ వేదికగా అడుగులు పడుతున్నాయి. శనివారం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రత్యక్షంగా చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గురువారం ప్రకటించారు. కీలక నేతలు వస్తుండటంతో భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇప్పటికే పాక్‌కు బయలుదేరారు. ఆయనతోపాటు ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్‌డ్ కుష్నర్ పాల్గొననున్నట్టు పాకిస్థాన్ రక్షణ వర్గాలు వెల్లడించాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ కూడా రావొచ్చని తెలిపాయి. ఇక ఇరాన్ తరఫున పార్లమెంటు స్పీకర్ బఘర్ గలీబఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, ఉప మంత్రి మాజిద్ తఖ్త్ రవాన్చి హాజరుకానున్నట్టు వెల్లడించాయి. ఇక మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ తరఫున ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, జాతీయ భద్రతా సలహాదారు, ఐఎ్‌సఐ చీఫ్ ఆసీమ్ మాలిక్ పాల్గొననున్నట్టు తెలిపాయి. కాగా, ఇరాన్ బృందం చర్చల కోసం పాక్ వెళుతున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రి సయీద్ ఖతీబ్‌జాదే వెల్లడించారని, వచ్చే రెండు రోజులు చాలా కీలకమని పేర్కొన్నారని ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest AP News And Telugu News