Share News

అప్పుల ఊబిలో అమెరికన్ల కుటుంబాలు.. EMIలు చెల్లించలేని పరిస్థితి!

ABN , Publish Date - Oct 11 , 2026 | 03:42 PM

అమెరికాలో సామాన్య కుటుంబాలు అప్పుల భారంతో సతమతమవుతున్నాయి. పెరిగిన ద్రవ్యోల్బణం, రుణ చెల్లింపులు కుటుంబ బడ్జెట్‌ను దెబ్బతీస్తున్నాయి. ఆదాయంలో 40 శాతానికి పైగా అప్పులకే వెచ్చించాల్సి వస్తుండటంతో EMIలు చెల్లించలేని పరిస్థితులు పెరుగుతున్నాయి.

అప్పుల ఊబిలో అమెరికన్ల కుటుంబాలు.. EMIలు చెల్లించలేని పరిస్థితి!
US Household Debt

US Household Debt Burden: అగ్రరాజ్యం అమెరికాలో సాధారణ కుటుంబాలపై అప్పుల భారం తీవ్రస్థాయికి చేరింది. పెరిగిన ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల కారణంగా ప్రతి నెలా ఈఎంఐలు (EMI) చెల్లించలేక సాధారణ పౌరులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Federal Reserve) విడుదల చేసిన ప్రతిష్టాత్మక 'సర్వే ఆఫ్ కన్సూమర్ ఫైనాన్సెస్' (Survey of Consumer Finances) నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 2010 నాటి ఆర్థిక మాంద్యం తర్వాత అమెరికాలో ఈ స్థాయిలో రుణ ఎగవేతలు పెరగడం ఇదే తొలిసారి అని నివేదిక స్పష్టం చేసింది.


20 శాతానికి పెరిగిన రుణ ఎగవేతలు

గత మూడేళ్ల కాలంలో ఈఎంఐలు, రుణ వాయిదాలు చెల్లించలేక డిఫాల్ట్ (రెండు లేదా అంతకంటే ఎక్కువ నెలలు ఆలస్యం) అయిన కుటుంబాల సంఖ్య 20 శాతానికి చేరింది. 2022లో ఈ సంఖ్య కేవలం 12 శాతంగా ఉండగా, ఇప్పుడు అది భారీగా పెరగడం గమనార్హం. అంతేకాదు, మొత్తం అమెరికన్ కుటుంబాల్లో తీవ్రమైన అప్పుల భారం మోస్తున్న కుటుంబాల నిష్పత్తి 8.6 శాతానికి పెరిగింది. ఈ కుటుంబాలు తమ మొత్తం నెలవారీ ఆదాయంలో 40 శాతానికి పైగా కేవలం అప్పులు, క్రెడిట్ కార్డు ఈఎంఐలు చెల్లించడానికే వెచ్చిస్తున్నాయి.


నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, వైద్య ఖర్చులు పెరగడంతో అల్పాదాయ (Low-income) కుటుంబాల నికర సంపద సగానికి పైగా తగ్గిపోయింది. వారు రోజువారీ అవసరాల కోసం క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లపై ఆధారపడటంతో రుణ చక్రబంధంలో చిక్కుకుపోతున్నారు. సగటు క్రెడిట్ కార్డు అప్పుల భారం భారీగా పెరిగింది. సమయానికి బిల్లులు చెల్లించలేకపోవడంతో 60 రోజుల కంటే ఎక్కువ కాలం బకాయిలు ఉన్నవారి సంఖ్య 8 శాతానికి పైగా నమోదైంది.


కరోనా కాలం నాటి ప్రభుత్వ సాయం ముగిసిపోవడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సుదీర్ఘకాలం పాటు గరిష్ఠ స్థాయిలో ఉంచడం వల్ల గృహ రుణాలు, ఆటో రుణాలు, క్రెడిట్ కార్డుల వడ్డీలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు పెరిగిన ద్రవ్యోల్బణంతో సామాన్యుల కొనుగోలు శక్తి పడిపోయి, అప్పుల ఎగవేతలకు దారితీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలనూ చవండి:

రియాద్ విమానాశ్రయంపై దాడి.. సౌదీకి సాయం గురించి అమెరికా ఆలోచన..

రియాద్ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. ఖండించిన భారత్

Updated Date - Oct 11 , 2026 | 04:04 PM