Share News

ఆ 10 సుంకాలూ చట్టవిరుద్ధమే!

ABN , Publish Date - May 09 , 2026 | 06:07 AM

అమెరికాలోకి వచ్చే వివిధ దేశాల వస్తు, సేవలపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 10 శాతం అదనపు సుంకాలు విధించటం చట్ట విరుద్ధమని న్యూయార్క్‌లోని కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ప్రకటించిం...

ఆ 10 సుంకాలూ చట్టవిరుద్ధమే!

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

దిగుమతులపై 10 శాతం అదనపు సుంకాలను

కొట్టివేసిన కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌

గతంలోనే అదనపు సుంకాలు

చట్ట విరుద్ధమన్న అమెరికా సుప్రీంకోర్టు

తాజా తీర్పుపై అప్పీల్‌కు

వెళ్లే యోచనలో ట్రంప్‌ సర్కారు

వాషింగ్టన్‌, మే 8: అమెరికాలోకి వచ్చే వివిధ దేశాల వస్తు, సేవలపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 10 శాతం అదనపు సుంకాలు విధించటం చట్ట విరుద్ధమని న్యూయార్క్‌లోని కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ప్రకటించింది. ఈ సుంకాలను సవాల్‌ చేస్తూ పలు చిన్న వ్యాపార సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. 2-1 తేడాతో గురువారం ఈ తీర్పు చెప్పింది. గతేడాది వివిధ దేశాలపై విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత.. ట్రంప్‌ సర్కారుకు ఈ తీర్పు అతిపెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. వాణిజ్య చట్టం-1974లోని సెక్షన్‌ 122 కింద విధించిన ఈ 10 శాతం అదనపు సుంకాలు చట్ట విరుద్ధమని న్యాయమూర్తులు ప్రకటించారు. కాంగ్రెస్‌ అనుమతి లేకుండా అధ్యక్షుడు సొంతంగా అదనపు సుంకాలు విధించలేరని స్పష్టంచేశారు. పిటిషన్‌ దారుల వద్ద అదనపు సుంకాల రూపంలో వసూలు చేసిన డబ్బును 5 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌ చేయాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దేశంలో నగదు, బంగారం నిల్వలు భారీగా పడిపోయినప్పుడు.. చెల్లింపుల సమస్య తలెత్తినప్పుడు మాత్రమే సెక్షన్‌ 122 కింద తాత్కాలిక సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని తీర్పు అనంతరం లిబర్టీ జస్టిస్‌ సెంటర్‌ సీనియర్‌ న్యాయవాది జెఫ్రీ ష్వాబ్‌ తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఉన్నది వాణిజ్య లోటు మాత్రమేనని, చెల్లింపుల సమస్య కాదని అన్నారు.


డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక పలు దేశాలపై ఇష్టం వచ్చినట్లుగా అదనపు సుంకాలు విధించారు. భారత్‌ నుంచి వెళ్లే వస్తు, సేవలపై కూడా 50 శాతం అదనపు సుంకాల భారం మోపారు. ఈ సుంకాలను పలు సంస్థలు సవాల్‌ చేయటంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు అదనపు సుంకాల విఽధింపు చట్ట విరుద్ధమని కొట్టివేసింది. ఈ తీర్పు వచ్చిన ఒకటిరెండు రోజుల్లోనే ట్రంప్‌.. వాణిజ్య చట్టం -1974 కింద 10ు అదనపు సుంకాలను విధించారు. ఈ సుంకాల విధింపు ఆదేశాలు వచ్చే జూలై 24వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. ఆలోపే కోర్టు వాటిని కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అంతకుముందు అదనపు సుంకాల రూపంలో వసూలు చేసిన డబ్బును ఆయా కంపెనీలకు చెల్లించేందుకు అమెరికా కస్టమ్స్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ విభాగంఏర్పాట్లు చేస్తోంది. టారిఫ్‌ రిఫండ్‌ కోసం 3,30,000 మంది దిగుమతిదారులు అర్హులని గుర్తించింది.

ఇవి కూడా చదవండి...

పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం

Updated Date - May 09 , 2026 | 06:07 AM