ట్రంప్ సుంకాలు.. తిరిగి చెల్లింపులు షురూ!
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:24 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వసూలు చేసిన సుంకాల తిరిగి చెల్లింపు ప్రకియ్ర ప్రారంభమైంది. ఆయన విధించిన సుంకాలు చెల్లవని, అవి రాజ్యాంగ విరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు..
సుప్రీంకోర్టు తీర్పుతో అమెరికా సర్కారు చర్యలు
వాషింగ్టన్, ఏప్రిల్ 20: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వసూలు చేసిన సుంకాల తిరిగి చెల్లింపు ప్రకియ్ర ప్రారంభమైంది. ఆయన విధించిన సుంకాలు చెల్లవని, అవి రాజ్యాంగ విరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ సంస్థల నుంచి వసూలు చేసిన సుంకాల సొమ్మును తిరిగి చెల్లించే ప్రక్రియను మొదలుపెట్టారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) విభాగం ఇందుకోసం కొత్తగా ఆన్‌లైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమవారం ఉదయం నుంచి దిగుమతిదారులు, వారి బ్రోకర్లు రిఫండ్లకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించవచ్చు. అమెరికా చరిత్రలో ఇది అతిపెద్ద రిఫండ్ ప్రక్రియగా నిలవనుంది. గత ఏడాది ట్రంప్ వివిధ దేశాలపై ఎడాపెడా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, 1977 నాటి అత్యవసర అధికారాల చట్టం కింద ట్రంప్ ఈ సుంకాలను విధించడం రాజ్యాంగ విరుద్ధమని ఈ ఏడాది ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. పన్నులు విధించే అధికారం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. సుంకాలు చెల్లుబాటు కాకపోవడంతో ఆ మొత్తం రిఫండ్ చేయాలని కోర్టు ఆదేశించింది. సుంకాలను చెల్లించిన వ్యాపార సంస్థలు, దిగుమతిదారులు ఈ రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రంప్ వెలువరించిన ఉత్తర్వుల అనంతరం 3.30 లక్షల మంది దిగుమతిదారులు దాదాపు 166 బిలియన్ డాలర్లను సుంకాల రూపంలో చెల్లించారు. ఇందులో 56,497 మంది దిగుమతిదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారికి వడ్డీతో కలిపి సుమారు 127 బిలియన్ డాలర్లు ప్రస్తుతం వాపసు ఇవ్వడానికి ట్రంప్ సర్కారు సిద్ధమవుతోంది.