Share News

60 రోజుల ఒప్పందం

ABN , Publish Date - May 25 , 2026 | 04:13 AM

అమెరికా- ఇరాన్‌ మధ్య శాశ్వత శాంతి సంధిపై కీలక ముందడుగు పడినట్లు తెలుస్తోంది. యుద్ధానికి పూర్తిగా ముగింపు పలికేందుకు ముందుగా 60 రోజుల కాలానికి తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకోవాలని రెండు దేశాలు నిర్ణయించినట్లు సమాచారం.

60 రోజుల ఒప్పందం

  • తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఖరారు చేసిన ఇరాన్‌-అమెరికా?

  • అందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్న డొనాల్డ్‌ ట్రంప్‌

  • శుద్ధి చేసిన యురే నియంను వదులుకోవడానికి ఇరాన్‌ అంగీకారం!

  • 60 రోజులు హోర్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు సిద్ధం

  • ఆ సమయంలో అణు ఒప్పందంపై ఇరు దేశాల మధ్య తదుపరి చర్చలు

  • అమెరికా మీడియా వెల్లడి.. అధికారికంగా స్పందించని ఇరాన్‌

వాషింగ్టన్‌, మే 24: అమెరికా- ఇరాన్‌ మధ్య శాశ్వత శాంతి సంధిపై కీలక ముందడుగు పడినట్లు తెలుస్తోంది. యుద్ధానికి పూర్తిగా ముగింపు పలికేందుకు ముందుగా 60 రోజుల కాలానికి తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకోవాలని రెండు దేశాలు నిర్ణయించినట్లు సమాచారం. ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై ఎంవోయూ ఖరారైనట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా విస్తృత సంప్రదింపుల తర్వాత ఇరాన్‌తో ఒప్పందం కుదిరిందని శనివారం ప్రకటించారు. ఇజ్రాయెల్‌తోపాటు సౌదీ, ఈజిప్టు, ఖతార్‌, తుర్కియే, పాకిస్థాన్‌, జోర్డాన్‌, బహ్రెయిన్‌తో చర్చించిన తర్వాత ఈ ఒప్పందాన్ని ఖరారుచేసినట్లు వెల్లడించారు. అయితే ఈ విషయంలో తొందరపడబోమని ట్రంప్‌ అన్నారు. తనవద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు ఇచ్చేందుకు ఇరాన్‌ అంగీకరించిందని న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తా సంస్థ తెలిపింది. ఈ తాత్కాలిక ఒప్పందం వార్తలపై ఇరాన్‌ అధికారికంగా స్పందించలేదు. ఆ దేశ వార్తా సంస్థ ఫార్స్‌ న్యూస్‌ మాత్రం ట్రంప్‌ ప్రకటన వాస్తవానికి చాలా దూరంగా ఉందని పేర్కొంది. ఒప్పందం కుదిరితే 30 రోజుల్లో హోర్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలను యుద్ధానికి ముందునాటి పరిస్థితికి తీసుకొస్తామని ఇరాన్‌ మరో వార్తా సంస్థ టాస్మిన్‌ న్యూస్‌ తెలిపింది. కాగా, భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో.. ఇరాన్‌పై విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటంలో ప్రపంచంలో ఇరాన్‌ను మించిన దేశం మరొకటి లేదని ఆరోపించారు.


ఒప్పందంలోని అంశాలు..

  • కాల్పుల విరమణను 60 రోజులు పొడిగించే ఎంవోయూపై అమెరికా-ఇరాన్‌ సంతకాలు చేస్తాయి. రెండు దేశాలు అంగీకరిస్తే దీనిని మరింత కాలం పొడిగించవచ్చు.

  • హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ తెరుస్తుంది. అందులో అమర్చిన సముద్ర మందుపాతరలను తొలగిస్తుంది.

  • జలసంధి గుండా వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పిస్తుంది. టోల్‌ వసూలు ఉండదు.

  • ఇరాన్‌ పోర్టులపై అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది. ఇరాన్‌ తన చమురును స్వేచ్ఛగా విక్రయించుకొనేలా ఆంక్షలను తొలగిస్తుంది.

  • ఈ ఒప్పందాన్ని ఇరాన్‌ అమలు చేసే తీరును బట్టి ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలను, విదేశాల్లోని ఇరాన్‌ నిధులపై ఉన్న ఆంక్షలను అమెరికా తొలగిస్తుంది.

  • ఇరాన్‌ అణ్వాయుధాలు తయారు చేయబోనని హామీ ఇస్తుంది. యూరేనియం శుద్ధి కార్యక్రమాన్ని వదిలేస్తుంది. తనవద్ద ఇప్పటికే ఉన్న 60 శాతం శుద్ధి చేసిన 440.9 కిలోల యురేనియంను అమెరికాకు అప్పగించే అంశంపై చర్చలు కొనసాగుతాయి.

  • ఈ 60 రోజుల్లో రెండు దేశాల మధ్య అణు ఒప్పందంపై చర్చలు కొనసాగుతాయి.

  • పశ్చిమాసియాలో ఉన్న అమెరికా బలగాలు.. చర్చలు కొనసాగుతున్నంత కాలం ఎక్కడివక్కడే ఉంటాయి. తుది ఒప్పందం కుదిరిన తర్వాతే పూర్తిగా ఉపసంహరిస్తుంది.

  • లెబనాన్‌లో ఇజ్రాయెల్‌- హెజ్బోల్లా మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణను పూర్తిగా నిలిపివేయాలి.

  • భవిష్యత్తులో హెజ్బొల్లా దాడులకు దిగితే ప్రతిస్పందించే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంటుంది.

  • అణు ఒప్పందానికి ఇరాన్‌ అంగీకరిస్తే.. ఆ దేశం ఆర్థికంగా కోలుకొనేందుకు అమెరికా సహాయం అందిస్తుంది.

Updated Date - May 25 , 2026 | 04:13 AM