డబ్ల్యూహెచ్ఓ నుంచి తప్పుకున్న అమెరికా! రూ. 2382 కోట్లు బాకీ
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:52 PM
డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా అధికారికంగా తప్పుకుంది. ఇకపై డబ్ల్యూహెచ్ఓకు తాము నిధులేవీ విడుదల చేయబోమని అమెరికా ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి అమెరికా తాజాగా వైదొలగింది. డబ్ల్యూహెచ్ఓ నుంచి తప్పుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో కాలంగా చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం అధికారికంగా యూఎస్ డబ్ల్యూహెచ్ఓ నుంచి తప్పుకుంది. ఇప్పటివరకూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా 260 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది (US Leaves WHO).
డబ్ల్యూహెచ్ఓకు అన్ని రకాల నిధుల విడుదలను నిలిపివేసినట్టు అమెరికా వైద్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ డబ్ల్యూహెచ్ఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న అమెరికా సిబ్బందిని కూడా వెనక్కు పిలిపించినట్టు తెలిపింది. అంతేకాకుండా, డబ్ల్యూహెచ్ఓ ప్రాయోజిత కమిటీలు, వర్కింగ్ గ్రూప్‌లు, ఇతర వేదికల్లో పాలుపంచుకోబోమని కూడా తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగినట్టు ట్రంప్ జారీ చేసిన ఆదేశాల మేరకు యూఎస్ వైద్య శాఖ ఈ ప్రకటన చేసింది. కొవిడ్ సంక్షోభ సమయంలో డబ్ల్యూహెచ్ఓ వైఫల్యం, సంస్కరణలు చేపట్టలేకపోవడం, రాజకీయ ప్రభావాలకు దూరంగా డబ్ల్యూహెచ్ఓ పనిచేయనందున తాము తప్పుకుంటున్నట్టు ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇక డబ్ల్యూహెచ్ఓకు బాకీ పడ్డ మొత్తాల్ని చెల్లించాల్సిన బాధ్యత కూడా తమపై లేదని అమెరికా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. డబ్ల్యూహెచ్ఓను వీడేముందు బాకీలను చెల్లించాలన్న చట్టబద్ధ నిబంధన ఏదీ లేదని తెలిపాయి.
2022, 2023 సంవత్సరాల్లో డబ్ల్యూహెచ్ఓకు అమెరికా ఏకంగా 1.3 బిలియన్ డాలర్ల నిధులను సమకూర్చింది. యూఎస్ తప్పుకున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓపై ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య సంబంధిత కార్యక్రమాలపై అధిక ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
ఇవి మామూలు పంచ్‌లు కావుగా.. ట్రంప్‌ను టార్గెట్ చేసిన మస్క్
అమెరికా వలసల శాఖ అధికారుల అదుపులో 5 ఏళ్ల చిన్నారి.. దేశవ్యాప్తంగా కలకలం