జులైలో యూకే కొత్త ప్రధాని ప్రమాణస్వీకారం!
ABN , Publish Date - Jun 22 , 2026 | 05:31 PM
బ్రిటన్ ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్టు కీర్ స్టార్మర్ తాజాగా ప్రకటించారు. అయితే, వచ్చే నెలలోనే కొత్త ప్రధాని దేశ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: యూకే ప్రధాని పదవి నుంచి తప్పుకున్నట్టు లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ తాజాగా ప్రకటించారు. అయితే, వచ్చే నెలలోనే నూతన ప్రధాని ప్రభుత్వ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం పార్టీ మద్దతు ఉన్న ఎంపీ ఆండీ బర్న్‌హ్యామ్ అభ్యర్థిత్వాన్ని ఎవరూ వ్యతిరేకించకుండా ఉంటే ఆయన వచే నెలలో ప్రధాని పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది. ప్రభుత్వ పనితీరుపై సొంత పార్టీలోనే విమర్శలు పెరగడంతో స్టార్మర్ తప్పుకోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే.
అయితే, తన పాలనలో పార్టీకి అనేక విజయాలు దక్కాయని రాజీనామా ప్రకటన సందర్భంగా స్టార్మర్ బలంగా వాదించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మునుపటి కంటే మెరుగైందని చెప్పారు. ఉద్యోగులు, వర్కర్ల జీతాలు పెరిగాయని చెప్పారు. లేబర్ పార్టీపై ప్రజాభిప్రాయాన్ని మార్చామని చెప్పారు. తన పాలనలో దేశంలో అక్రమ వలసలకు కూడా అడ్డుకట్ట పడిందని అన్నారు. వేల మందిని పేదరికం నుంచి బయటపడేశామని చెప్పారు.
బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరనే దానిపై కూడా స్టార్మర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆండీ బర్న్‌హామ్ అభ్యర్థిత్వా ఎవరూ వ్యతిరేకించకపోతే ఆయన వచ్చే నెలలోనే ప్రధాని పగ్గాలు చేపడతారని అన్నారు. ఒక వేళ ఎన్నికలు జరగాల్సి వస్తే ఆగస్టు నాటికి నూతన ప్రధాని యూకే పగ్గాలు చేపడతారని చెప్పారు. ఈ దిశగా ఒక టైమ్‌టేబుల్‌ను రూపొందించాలని పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కూడా సూచించానని చెప్పారు. నూతన ప్రధానికి తన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించిన కీర్ స్టార్మర్
మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం.. నాలుగు విమానాశ్రయాల మూసివేత..