Share News

బ్రిటన్‌ ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించిన కీర్‌ స్టార్మర్‌

ABN , Publish Date - Jun 22 , 2026 | 02:50 PM

యూకే రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్టు కీర్ స్టార్మర్ ప్రకటించారు. పార్టీ నేతల ఒత్తిడి మేరకు ఆయన తప్పుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

బ్రిటన్‌ ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించిన కీర్‌ స్టార్మర్‌
Keir Starmer

ఇంటర్నెట్ డెస్క్: యూకేలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు కీర్ స్టార్మర్ ప్రకటించారు. లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నానని పేర్కొన్నారు. రాజీనామా కోసం పార్టీ నుంచి ఒత్తిడి పెరగడంతో కీర్ స్టార్మర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024లో కీర్ స్టార్మర్ యూకే 58వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

స్టార్మర్ నాయకత్వంపై లేబర్ పార్టీలో కొంత కాలంగా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆయన సారథ్యంలో ప్రభుత్వ పాప్యులారిటీ తగ్గుతోందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది. ప్రజాసేవలను మెరుగు పరుస్తానంటూ కీర్ స్టార్మర్ రెండేళ్ల క్రితం ప్రధాని బాధ్యతలు చేపట్టారు. జీవన వ్యయాలు తగ్గిస్తానని ప్రజలకు మాటిచ్చి గద్దెనెక్కారు. ఆర్థిక ఆభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు. అయితే, హామీల మేరకు ఫలితాలు లేకపోవడంతో ప్రజల్లో విముఖత పెరగడంపై లేబర్ పార్టీలో ఆందోళన వ్యక్తం అవుతోంది.


ఈ నేపథ్యంలో లేబర్ పార్టీకి చెందిన మరో నేత ఆండీ బర్న్‌హామ్ రూపంలో కీర్ స్టార్మర్ నాయకత్వానికి సవాలు ఎదురైంది. గతంలో గ్రేటర్ మాంచెస్టర్‌ మేయర్‌గా ఉన్న ఆయన కీర్ స్టార్మర్‌పై ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికలో ఘన విజయం సాధించారు. స్టార్మర్ నాయకత్వానికి సవాలు విసురుతూ పార్లమెంటులో కాలుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో స్టార్మర్ తప్పుకోవాలన్న ఒత్తిడి పార్టీలో పెరగడంతో ఆయన రాజీనామాను ప్రకటించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

లేబర్ పార్టీతో పాటు కన్జర్వేటివ్ పార్టీపై కూడా యూకే ప్రజల్లో విముఖత వ్యక్తం అవుతోందని స్థానిక మీడియా చెబుతోంది. దీంతో, రైజింగ్ రీఫార్మ్ పార్టీ, గ్రీన్ పార్టీ వంటి ప్రత్యామ్నాయాలకు ప్రజాదరణ అంతకంతకూ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తమ పట్టును నిలుపుకునేందుకు అధికార లేబర్ పార్టీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ప్రధాని కీర్ స్టార్మర్ తప్పుకోవాల్సి వచ్చిందని అక్కడి విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం.. నాలుగు విమానాశ్రయాల మూసివేత..

సింధు జలాలపై భారత్ కఠిన వైఖరి.. యుద్ధానికి సిద్ధమంటున్న పాకిస్థాన్ రక్షణ మంత్రి..

Updated Date - Jun 22 , 2026 | 04:36 PM