వచ్చే ఏడాది నుంచి పిల్లలకు సోషల్ మీడియా నిషేధం: బ్రిటన్ ప్రధాని
ABN , Publish Date - Jun 15 , 2026 | 01:51 PM
చిన్నారులకు సోషల్ మీడియాను నిషేధించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచీ ఈ నిషేధాన్ని అమలు చేస్తామని ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా దుష్ర్పభావాల నుంచి పిల్లలను కాపాడేందుకు యూకే ప్రభుత్వం నడుం కట్టింది. వచ్చే ఏడాది నుంచి యూకేలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధిస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తాజాగా తెలిపారు. ఈ ఏడాది చివరి కల్లా ఇందుకు సంబంధించిన చట్టాన్ని రూపొందిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి అమల్లోకి తెస్తామని అన్నారు. ఆన్‌లైన్ ప్రపంచం తాలూకు చెడు ప్రభావాల నుంచి పిల్లల్ని కాపాడుకునేందుకు గట్టి రక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ‘పూర్తిస్థాయి నిషేధమే సబబని నాకు అనిపిస్తోంది. దీన్ని అమలు చేయడం చాలా కష్టం. కానీ టెక్ కంపెనీ ఒత్తిడిని ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే’ అని ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు.
ఈ ప్రతిపాదనల పూర్తిస్థాయి అమలుకు తాను సిద్ధమేనని పేర్కొన్నారు. పిల్లల భద్రత, ఆనందం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పిల్లలకు ఆన్‌లైన్ ప్రపంచం నుంచి రక్షణ కల్పించడమే ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబాల పక్షాన నిలవాల్సిన సమయం ఇదేనని అభిప్రాయపడ్డారు. యథాతథ స్థితితో ఎలాంటి ప్రయోజనం కలగట్లేదని తాము గుర్తించినట్టు చెప్పారు.
ఆస్ట్రేలియాలో ఇప్పటికే ఈ తరహా నిషేధం అమలవుతోంది. సోషల్ మీడియాపై ఆంక్షలకు ఇండోనేషియా కూడా సిద్ధమైంది. పిల్లల సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి బ్రెజిల్‌లో ఇప్పటికే పలు రకాల ఆంక్షలు అమల్లో ఉన్నాయి. పిల్లలకు సోషల్ మీడియా నిషేధానికి ఫ్రాన్స్ కూడా సిద్ధమైంది. తుర్కియే చర్యలు తుదిదశలో ఉన్నాయి. ఇతర పాశ్చాత్య దేశాలు కూడా ఇదే బాటలో అడుగులు వేస్తున్నాయి. అయితే, తాను తీసుకునే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని బ్రిటన్ ప్రధాని చెప్పారు. ఈ విషయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తామని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ట్రంప్ డీల్‌కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు : ఇజ్రాయెల్ మంత్రి
బీబీతో వ్యవహారం కష్టమే: డొనాల్డ్ ట్రంప్