ట్రంప్ డీల్‌కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు : ఇజ్రాయెల్ మంత్రి
ABN , Publish Date - Jun 15 , 2026 | 01:01 PM
ఇరాన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందానికి తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా వ్యవహారాల మంత్రి ఇతమార్ బెన్ గ్విర్ తాజాగా తేల్చి చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: యూఎస్-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ జాతీయ భద్రతా వ్యవహారాల మంత్రి ఇతమార్ బెన్-గ్విర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ కుదుర్చుకున్న ఒప్పందానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఇజ్రాయెల్ ఒక సార్వభౌమ దేశమని, అమెరికాకు సామంత రాజ్యం కాదని తేల్చి చెప్పారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో తమకు గతంలో ఎదురైన గుణపాఠాల ఆధారంగా ఈ డీల్ విషయంలో స్పందిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
‘ట్రంప్ ఒప్పందానికి మేము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. మేము యూఎస్‌కు సామంత రాజ్యం కాదు.. ఇజ్రాయెల్ ఒక సార్వభౌమదేశం. అయితే, మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే.. యూఎస్ఏ అంటే మాకెంతో గౌరవం, అధ్యక్షుడు ట్రంప్‌కు ఎంతో రుణపడి ఉన్నాము’ అని బెన్-గ్విర్ అన్నారు.
అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇతర దేశాల ఒత్తిడికి లొంగిపోయి చివరకు రక్తంతో మూల్యం చెల్లించుకున్నామని అన్నారు. ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. ఓస్లో అకార్డ్స్, 2006 లెబనాన్ ఒప్పందం, గాజాలో ఎదురైన పరిస్థితులను కూడా మంత్రి ప్రస్తావించారు. ఆ అనుభవంతోనే యూఎస్ ఇరాన్ డీల్‌ను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
తాజాగా కుదిరిన శాంతి ఒప్పందం ప్రకారం, అన్ని రకాల మిలిటరీ చర్యలకు తక్షణం ఫుల్ స్టాప్ పెట్టాలని అమెరికా, ఇరాన్‌లు అంగీకరించాయి. లెబనాన్ సహా తమ మిత్రపక్షాలెవరిపైనా ఎలాంటి దాడులు జరగకూడదని ఇరాన్ షరతు విధించింది. ఇందుకు యూఎస్ అంగీకరించింది. అయితే, డీల్‌కు కొన్ని గంటల ముందు కూడా ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులకు దిగింది. దీంతో, ఒప్పందం కుప్పకూలే స్థితి వచ్చిందని అన్నారు. చివరకు కొన్ని గంటల ఆలస్యంగా డీల్ ఖరారైందని చెప్పారు.