Share News

ఎప్‌స్టీన్ ఫైల్స్ కలకలం.. బ్రిటన్ ప్రధాని క్షమాపణలు

ABN , Publish Date - Feb 05 , 2026 | 07:23 PM

ఎప్‌స్టీన్‌తో క్లోజ్ ఫ్రెండ్‌‌షిప్ ఉన్న పీటర్ మాండెల్సన్‌ను రాయబారిగా నియమించినందుకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్‌మర్ తాజాగా క్షమాపణలు చెప్పారు. వారి మధ్య అంతటి స్నేహం ఉందని తనకు తెలియదన్నారు.

ఎప్‌స్టీన్ ఫైల్స్ కలకలం.. బ్రిటన్ ప్రధాని క్షమాపణలు
Keir Starmer Apology Over Epstein Files

ఇంటర్నెట్ డెస్క్: లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించి ఇటీవల అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన పలు దస్త్రాలు (Epstein Files) తాజాగా బ్రిటన్‌లోనూ కలకలం రేపుతున్నాయి. ఈ దస్త్రాల్లో బ్రిటన్ రాయబారి పీటర్ మాండెల్సన్ (Peter Mandelson) పేరు కూడా ఉండటంతో తాజాగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) క్షమాపణలు తెలిపారు.

జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో పీటర్ మాండెల్సన్‌కు అంత క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉన్నదని తెలియక ఆయన్ను రాయబారిగా నియమించినట్టు బ్రిటన్ ప్రధాని చెప్పుకొచ్చారు. 2024 డిసెంబర్‌లో పీటర్‌ను ప్రధాని అమెరికాకు రాయబారిగా నియమించారు. ఆ తరువాత ఎప్‌స్టీన్‌తో స్నేహం వెలుగులోకి రావడంతో బ్రిటన్ ప్రభుత్వం ఆయనను తొలగించింది. తాజాగా ఆయన బ్రిటన్ ఎగువ సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.


‘మాండెల్సన్‌, ఎప్‌స్టీన్ మధ్య పరిచయం గురించి అందరికీ తెలుసు. అయితే, వారి మధ్య అంత క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉన్నట్టు నాకు తెలియలేదు. వారి స్నేహం వెనుకున్న చీకటి గురించి అసలేమాత్రం తెలియదు. ఎప్‌స్టీన్ బారిన పడ్డ వారికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. బాధితులకు న్యాయం చేయడంలో అధికారంలో ఉన్న వారు విఫలమయ్యారు. మాండెల్సన్ మాటలు నమ్మినందుకు నేను మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా. అతడికి రాయబారి బాధ్యతలు అప్పగించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని ప్రధాని స్టార్మర్ అన్నారు.


ఎప్‌స్టీన్‌తో సుదీర్ఘకాలం స్నేహం కొనసాగించిన విషయం వెలుగులోకి వచ్చాక మాండెల్సన్‌ను ప్రభుత్వం తొలగించింది. ఎప్‌స్టీన్‌తో స్నేహం కొనసాగించినందుకు తాను విచారపడుతున్నట్టు మాండెల్సన్ అంతకుముందు తెలిపారు.

ఇక ఈ దస్త్రాల్లో తన పేరు ఉండటంతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ (Bill Gates Apology) కూడా స్పందించారు. అతడికి సమయం కేటాయించినందుకు క్షమాపణలు తెలిపారు. ఆ ఫైల్స్‌లో తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. ఇక ఈ ఫైల్స్‌లో పేర్లు ఉన్న వారంతా తప్పు చేసినట్టు కాదని అమెరికా న్యాయశాఖ కూడా ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది.


ఇవీ చదవండి:

క్షమాపణ చెబుతున్నా.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై బిల్ గేట్స్ స్పందన

స్వీయ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత! ముడిచమురు కొనుగోళ్లపై భారత్

Updated Date - Feb 05 , 2026 | 10:04 PM