స్వీయ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత! ముడిచమురు కొనుగోళ్లపై భారత్
ABN , Publish Date - Feb 05 , 2026 | 03:59 PM
రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ తాజాగా స్పందించింది. దేశ ప్రజల ఇంధన భద్రతకే తమ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేసింది.
ఢిల్లీ: రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. భారత్‌పై సుంకాలను తగ్గించామని సోషల్ మీడియాలో ప్రకటిస్తూ ఈ అంశాన్నీ వెల్లడించారు. తమ మధ్య ట్రేడ్ డీల్ కుదిరిందని ప్రకటించిన సందర్భంగా భారత్- రష్యా చమురు అంశాన్ని ప్రస్తావించారు ట్రంప్. ఈ విషయమై భారత విదేశాంగ శాఖ తొలిసారిగా స్పందించింది. ఇంధన రంగంలో ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో తాము 140 కోట్ల మంది దేశ ప్రజల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది (India on Halting Russian Oil Imports).
‘దేశ ఇంధన భద్రత, చమురు కొనుగోళ్లపై భారత ప్రభుత్వం ఇప్పటికే తన వైఖరిని పలుమార్లు బహిరంగంగా స్పష్టం చేసింది. 140 కోట్ల మంది భారత ప్రజల ఇంధన భద్రతను కాపాడటానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోంది. మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలను అనుసరించి వివిధ దేశాల నుంచి ఇంధన దిగుమతులను కొనసాగించే వ్యూహాన్ని భారత్ అనుసరిస్తోంది. భారత్ ఇప్పటివరకూ తీసుకున్న నిర్ణయాలు, ఇకపై తీసుకునే నిర్ణయాలన్నీ ఇదే పంథాలో ఉంటాయి’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ (Randhir Jaiswal MEA) ఓ ప్రకటనలో తెలిపారు.
రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయడంతో పాటు వెనెజువెలా, అమెరికాల నుంచి ముడి చమురు దిగుమతులకు భారత్ సిద్ధంగా ఉందని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ అంశంపై కూడా రణ్‌ధీర్ జైస్వాల్ స్పందించారు. వెనెజువెలాతో ఎంతో కాలంగా భారత్‌కు వాణిజ్య భాగస్వామ్యం ఉందని గుర్తు చేశారు. వెనెజువెలా చమురు కొనుగోలుకు తాము సుముఖంగానే ఉన్నామన్నారు. దీంతో పాటు వాణిజ్య పరంగా అవకాశం ఉన్న అన్ని చోట్ల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటామని స్పష్టం చేశారు.
ఇక ట్రంప్ ప్రకటనపై ఇటీవలే రష్యా కూడా స్పందించింది. చమురు కొనుగోళ్లను నిలిపివేసినట్టు తమకు భారత్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది. భారత్-అమెరికా దౌత్య బంధాన్ని తాము గౌరవిస్తామని రష్యా ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. అదే సమయంలో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి అంతే ప్రాముఖ్యతను ఇస్తామని అన్నారు. తమ తొలి ప్రాధాన్యత ఇదేనని కూడా స్పష్టం చేశారు. ఇక ట్రేడ్ డీల్‌కు సంబంధించి భారత్, అమెరికాలు త్వరలో సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
ట్రేడ్ డీల్.. త్వరలో భారత్, యూఎస్ సంయుక్త ప్రకటన!