క్షమాపణ చెబుతున్నా.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై బిల్ గేట్స్ స్పందన
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:39 PM
లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన దస్త్రాల్లో తన పేరు రావడంపై బిల్ గేట్స్ స్పందించారు. ఎప్‌స్టీన్‌కు కేటాయించిన ప్రతి క్షణానికి తాను ప్రస్తుతం పశ్చాత్తాపపడుతూ క్షమాపణ చెబుతున్నానని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎప్‌స్టీన్ లైంగిక నేరాల కేసుకు సంబంధించిన దస్త్రాల్లో (Epstein Files) తన పేరు ప్రస్తావనకు రావడంపై మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా స్పందించారు. చిన్నారులపై అకృత్యాలకు పాల్పడిన ఎప్‌స్టీన్‌కు సమయం ఇచ్చినందుకు తాను పశ్చాత్తాపపడుతున్నానని అన్నారు. అతడికి కేటాయించిన ప్రతి క్షణానికి తాను ప్రస్తుతం చింతిస్తున్నానని అన్నారు. క్షమాపణలు కూడా చెబుతున్నట్లు తెలిపారు (Bill Gates Statement).
అయితే, ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమేనని బిల్ గేట్స్ స్పష్టం చేశారు. అవన్నీ అసంబద్ధ ఆరోపణలని తేల్చి చెప్పారు. ఎప్‌స్టీన్ తనను కావాలనే టార్గెట్ చేసినట్టు అనిపిస్తోందని అన్నారు. ‘జెఫ్రీ ఎప్‌స్టీన్ రాసుకున్న ఆ ఈమెయిల్స్‌ను ఎవరికీ పంపించలేదు. అసలు ఆ మెయిల్స్ అన్నీ అసత్యాలే. అసలు అతడి మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు. నన్ను కావాలనే టార్గెట్ చేశాడని అనిపిస్తోంది’ అని గేట్స్ ఓ మీడియా సంస్థకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
ఎప్‌స్టీన్ కుంభకోణానికి సంబంధించి అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన డాక్యుమెంట్స్‌లో బిల్ గేట్స్ ప్రస్తావన కూడా వచ్చిన విషయం తెలిసిందే. రష్యా యువతులతో సన్నిహితంగా మెలిగిన గేట్స్ సుఖ వ్యాధి బారిన పడ్డాడని ఎప్‌స్టీన్ ఓ మెయిల్‌లో రాసుకొచ్చాడు. అంతేకాకుండా, గేట్స్ తన భార్య మెలిండాకు సీక్రెట్‌గా ఇచ్చేందుకు యాంటీబయాటిక్స్ కావాలనీ కోరినట్టు తెలిపాడు. ఎప్‌స్టీన్ 2019లో జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు కథనాలు వెలువడ్డాయి.
ఈ పరిణామాలపై గేట్స్ మాజీ భార్య మెలిండా (Melinda) కూడా స్పందించారు. పెళ్లైన 27 ఏళ్ల తరువాత ఆమె 2021లో భర్త బిల్ గేట్స్ నుంచి విడాకులు తీసుకున్నారు. నాటి పరిస్థితులు తన వైవాహిక జీవితంలో అత్యంత కఠిన క్షణాలని అన్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లోని అంశాలతో ముడిపడిన వారందరూ సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. ఆ రొచ్చు నుంచి బయటకు వచ్చినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందనీ కామెంట్ చేశారు.
ఇవీ చదవండి:
ట్రేడ్ డీల్.. త్వరలో భారత్, యూఎస్ సంయుక్త ప్రకటన!
స్వీయ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత! ముడిచమురు కొనుగోళ్లపై భారత్