Share News

మేము ఉగ్రవాదులం కాదు, ఉగ్రవాద బాధితులం: ఐరాసలో ఇరాన్ అధ్యక్షుడు

ABN , Publish Date - Sep 23 , 2026 | 08:33 PM

తమది ఉగ్రవాద దేశమంటూ నిందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గట్టి కౌంటర్ ఇచ్చారు

మేము ఉగ్రవాదులం కాదు, ఉగ్రవాద బాధితులం: ఐరాసలో ఇరాన్ అధ్యక్షుడు
Iran President Masoud Pezeshkian UN Speech

ఇంటర్నెట్ డెస్క్: తమది ఉగ్రవాద దేశమంటూ నిందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో తాజాగా ప్రసంగించిన ఆయన అమెరికా ఆరోపణలను తిప్పికొట్టారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తామే బాధితులుగా మిగిలామని అన్నారు. ‘నిన్న ట్రంప్ మమల్ని టెర్రరిస్టులని అన్నారు. కానీ మేము ఉగ్రవాద బాధితులుగా ఉన్నాము’ అని అన్నారు. అమెరికా మిలిటరీ చర్యల సందర్భంగా ఇరాన్‌లోని మినాబ్ స్కూల్‌పై జరిగిన దాడి చిత్రాలను కూడా ఆయన ప్రదర్శించారు. ఈ దాడిలో మృతి చెందిన చిన్నారులు, వారి సమాధుల ఫొటోలను చూపించారు. ఇరాన్ సుప్రీం లీడర్ మృతి, సామాన్య పౌరులపై దాడులపై గురించి కూడా ప్రస్తావించారు.


‘నేను ఇరాన్ నుంచి వచ్చాను, మా సుప్రీం లీడర్‌ను అన్యాయంగా, అక్రమంగా పొట్టనపెట్టుకున్నారు. వాళ్లు స్కూల్‌పై దాడి చేశారు. ఈ చిన్నారులను చూస్తున్నారుగా.. అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోగించిన బాంబులకు వీరు మరణించారు. వీరు చిన్నారులు.. ఏ పాపం తెలియని వారు’ అని పేర్కొన్నారు.

తాము మాత్రం ప్రత్యర్థి దేశాల పౌరులను ఏనాడూ టార్గెట్ చేయలేదని చెప్పారు. అయితే, పూర్తిశక్తియుక్తులతో తమని తాము రక్షించుకుంటామని స్పష్టం చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో శత్రువులు తమపై దాడి చేసినా తాము తలవంచలేదని చెప్పారు.


అసలు ఉగ్రవాదం వారిదే..

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇజ్రాయెల్‌పై కూడా మండిపడ్డారు. ఇరాన్‌లోని మౌలిక వసతులైన యూనివర్సిటీలు, వైద్య కేంద్రాలు, స్కూళ్లు, ఆసుపత్రులను టార్గెట్ చేశారని ఆరోపించారు. ‘వాళ్ల దాడులకు మేము ప్రతిస్పందించాము. అయినా ఏనాడూ సామాన్య పౌరులను టార్గెట్ చేయలేదు. ఆధునిక సాంకేతికతతో వాళ్లు మారణ హోమం సృష్టించారు. కానీ మాపై ఉగ్రవాదులుగా ముద్ర వేశారు. ఈ అస్థిరతకు మేము కారణమా? మా జీవితాలను మేము స్వతంత్రంగా కొనసాగించాలనేదే మా కోరిక’ అని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

రష్యాతో వాణిజ్యానికి ఫుల్‌‌స్టాప్ పెట్టాలి.. భారత్‌కు ఉక్రెయిన్ పిలుపు

హోర్ముజ్‌పై కఠిన ఆంక్షలు.. కొత్త చట్టం తెచ్చిన ఇరాన్ పార్లమెంట్

Updated Date - Sep 23 , 2026 | 08:52 PM