మిసైల్ దాడి అలర్టులు.. దుబాయ్‌లో కలకలం
ABN , Publish Date - Jun 26 , 2026 | 07:56 PM
మిసైల్ దాడులు జరిగే అవకాశం ఉందంటూ దుబాయ్ ప్రజల మొబైల్ ఫోన్స్‌లో శుక్రవారం అకస్మాత్తుగా మెసేజీలు రావడంతో కలకలం రేగింది.
ఇంటర్నెట్ డెస్క్: మిసైల్ దాడులు జరిగే అవకాశం ఉందంటూ దుబాయ్ ప్రజల మొబైల్ ఫోన్స్‌లో శుక్రవారం అకస్మాత్తుగా మెసేజీలు రావడంతో కలకలం రేగింది. ఆ తరువాత కొన్ని నిమిషాలకే మేసేజీలను పట్టించుకోవద్దని మరో అలర్ట్ రావడంతో అసలు ఏం జరుగుతోందో అర్థం కాక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
మిసైల్ దాడి జరిగే అవకాశం ఉండటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సందేశాలు అందాయి. ఈ అలర్టులను పట్టించుకోవద్దని ఆ తరువాత మళ్లీ మెసేజీలు ప్రజలకు అందినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో యూఏఈ అంతర్గత వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో సాధారణ పరిస్థితులే ఉన్నాయని పేర్కొంది. అయితే, ప్రజల మొబైల్స్‌కు వచ్చిన అలర్ట్ మెసేజీలకు కారణం ఏమిటనేది మాత్రం వెల్లడించలేదు.
పశ్చిమాసియాలో ఇప్పటికీ పరిస్థితులు ఉద్రిక్తతంగా ఉన్న నేపథ్యంలో మిసైల్ అలర్ట్ మెసేజీలు కలకలం రేపుతున్నాయి. శాంతిస్థాపన దిశగా జున్ 17న అమెరికా, ఇరాన్ మధ్య అవగాహన కుదిరిన విషయం తెలిసిందే. అయితే, హోర్ముజ్ విషయంలో ఇరాన్ ఇప్పటికీ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్‌తో ఘర్షణ ప్రారంభమయ్యాక ఇరాన్ మిసైల్ దాడులకు యూఏఈలో 13 మంది మరణించారు. మరో 227 మంది గాయపడ్డారు. మృతుల్లో యూఏఈ పౌరులతో పాటు విదేశస్తులు కూడా ఉన్నారు. అక్కడి గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ మిసైల్స్‌ను అడ్డుకున్నప్పటికీ క్షిపణి శకలాలు తగలడంతో అధిక శాతం మంది మరణించారు.
ఈ వార్తలనూ చదవండి:
అపరేషన్ అమిస్తాడ్.. వెనెజువెలాకు భారత్ ఆపన్న హస్తం
ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి.. రష్యాలోని 12 ప్రాంతాలపై..