Share News

చమురు ఎగుమతి దేశాల కూటమికి యూఏఈ గుడ్‌బై

ABN , Publish Date - Apr 29 , 2026 | 06:13 AM

కల్లోల పశ్చిమాసియాలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. చమురు ఎగుమతి దేశాల కూటములైన ఒపెక్‌(ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌), ఒపెక్‌ ప్లస్‌ నుంచి....

చమురు ఎగుమతి దేశాల కూటమికి యూఏఈ గుడ్‌బై

అబుదాబి, ఏప్రిల్‌ 28: కల్లోల పశ్చిమాసియాలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. చమురు ఎగుమతి దేశాల కూటములైన ఒపెక్‌(ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌), ఒపెక్‌ ప్లస్‌ నుంచి వైదొలగుతున్నట్టు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్టు ఆ దేశ అధికారిక మీడియా ‘డబ్ల్యూఏఎం’ తెలిపింది. ఒపెక్‌ నుంచి వైదొలగిన తర్వాత కూడా బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తామని.. మార్కెట్‌ పరిస్థితులు, డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని క్రమంగా, నియంత్రిత పద్ధతిలో మార్కెట్‌కు తీసుకొస్తామని యూఏఈ చెప్పింది. ఇరాన్‌ యుద్ధం కారణంగా చమురు సంక్షోభంతో ప్రపంచమంతా అల్లాడుతున్న సమయంలో యూఏఈ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చమురు ఉత్పత్తి పెంపు విషయంలో ఒపెక్‌ దేశాల మధ్య తలెత్తిన అంతర్గత కలహాల నేపథ్యంలోనే యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఒపెక్‌ ప్లస్‌ కూటమి విధిస్తున్న కోటాల వల్ల ఆ దేశం తన పూర్తి సామర్థ్యం మేరకు చమురును ఉత్పత్తి చేయలేకపోతోంది. ఇక.. ప్రపంచంలో చమురు ఉత్పత్తి దేశాల్లో సౌదీ, ఇరాక్‌ తర్వాత మూడోస్థానంలో యూఏఈ ఉంది. ఒపెక్‌ప్లస్‌ దేశాల మొత్తం చమురు ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు 15ు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఆ దేశం బయటకు వెళ్లిపోవడం వల్ల చమురు ధరలను నియంత్రించే విషయంలో ఒపెక్‌ ప్లస్‌ శక్తి గణనీయంగా తగ్గుతుంది. ఒపెక్‌కి అనధికారిక నాయకుడిగా ఉన్న సౌదీకి కూడా ఈ నిర్ణయం ఒక పెద్ద దెబ్బలాంటిదే. యూఏఈ వల్ల మార్కెట్లోకి అధిక చమురు వస్తే.. ధరల విషయంలో సౌదీ మాటకు ఇన్నాళ్లుగా ఉన్న చెల్లుబడి తగ్గిపోతుంది.

ఇవి కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..

Updated Date - Apr 29 , 2026 | 06:13 AM