Share News

మీడియాపై ట్రంప్‌ కస్సుబుస్సు

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:02 AM

మీడియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి శివాలెత్తారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని.. గత అధ్యక్షుడు, డెమోక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ తప్పుడు...

మీడియాపై ట్రంప్‌ కస్సుబుస్సు

  • మైక్రోఫోన్‌ తీసేసి ఇంటర్వ్యూ మధ్యలోనే నిష్క్రమణ

వాషింగ్టన్‌, జూన్‌ 8: మీడియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి శివాలెత్తారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని.. గత అధ్యక్షుడు, డెమోక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ తప్పుడు మార్గంలో గెలిచారన్న ఆయన ఆరోపణలకు ఆధారాలు అడగడంతో మోడరేటర్‌పై కేకలు వేసి ఇంటర్వ్యూ మధ్యలోనే నిష్క్రమించారు. ఎన్‌బీసీ న్యూస్‌ తరఫున క్రిస్టెన్‌ వెల్కర్‌ శుక్రవారం ఆయన్ను ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఇది ప్రసారమైంది. తొలుత ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చల పురోగతిని క్రిస్టెన్‌ ప్రశ్నించారు. తర్వాత 180 కోట్ల డాలర్లతో ఆయన ప్రతిపాదించిన ‘యాంటీ-వెపనైజేషన్‌ ఇనీషియేటివ్‌’ నిధి ఉద్దేశాన్ని నిలదీశారు. గత బైడెన్‌ యంత్రాంగం అనుచితంగా టార్గెట్‌ చేసిన వ్యక్తులకు నష్టపరిహారం చెల్లించేందుకు ఈ ఫండ్‌ను ట్రంప్‌ ప్రతిపాదించారు. దీనిని విపక్ష డెమోక్రాట్లే కాకుండా.. పాలక రిపబ్లికన్లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై చర్చించే సమయంలో ట్రంప్‌.. బైడెన్‌, మీడియాపై విమర్శలు గుప్పించారు. ‘ఈ ఫండ్‌ మంచి ఆలోచన.. ఫేక్‌ డర్టీ మీడియా, కుటిల మీడియా.. మూర్ఖుడైన బైడెన్‌, ఆయన చుట్టూ ఉన్నవారు ప్రజల జీవితాలను నాశనం చేశారు. ఏ తప్పూచేయని వారిని జైలుకు పంపారు’ అని ఆరోపించారు. ఈ ఆరోపణల్లో కొన్నిటికి ఆధారాలే లేవని క్రిస్టెన్‌ అనగా.. ట్రంప్‌ ఆగ్రహంతో రెచ్చిపోయారు. బ్రహ్మాండమైన ఆధారం ఉందని స్పష్టంచేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని.. 2020 ఎన్నికలు మోసపూరితమని.. ప్రస్తుతం కాలిఫోర్నియా (గవర్నర్‌, కాంగ్రెస్‌) ప్రైమరీ ఎన్నికల కౌంటింగ్‌లోనూ అవకతవకలు జరుగుతున్నాయని.. ఓట్ల లెక్కింపు చాలా మందగొడిగా సాగుతోందని ఆక్షేపించారు. డెమోక్రాట్లు ఎన్నికల మోసాలకు పాల్పడుతున్నారనేందుకు రుజువులు ఉన్నాయా అని ఆమె అడుగగా.. మీడియాపై ట్రంప్‌ అక్కసు వెళ్లగక్కారు. ప్రధాన టీవీ నెట్‌వర్క్‌ల కవరేజీ పక్షపాత ధోరణితో ఉందని.. ఎన్నికల్లో వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు. అర్ధాంతరంగా మైక్రోఫోన్‌ను తీసివేసి.. ఇక చాలంటూ ఇంటర్వ్యూ ఆపేసి ‘థాంక్స్‌ డార్లింగ్‌’ అంటూ లేచారు. నిజాయితీ లేని ప్రెస్‌ ఉంటే ఏ దేశమూ గొప్పది కాజాలదంటూ ట్రంప్‌ నిష్క్రమించారు.

Updated Date - Jun 09 , 2026 | 04:02 AM